munugode politics: మునుగోడు కాంగ్రెస్ లో ముసలం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎఫెక్ట్!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మొన్నటి వరకు మునుగోడు నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తారని భావిస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి షాక్ ఇచ్చి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన ఎన్నికల బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించిన జాబితాలో మునుగోడు నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరును ప్రకటించింది.
దీంతో మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించిన చలమల కృష్ణారెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీని వదిలి బిజెపికి వెళ్లి, ఎన్నికల కోసం బిజెపి నుండి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి టికెట్ కేటాయించడంతో ఆయన తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఈ క్రమంలో ఆయన నేడు తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు.

ఇదే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా బలమైన నాయకుడని, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తారని అన్నారు. పార్టీ ఆయనకు మరొకచోట సీటును కేటాయించాలని చలమల కృష్ణారెడ్డి అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలోకి వస్తే కాంగ్రెస్ మరింత బలపడుతుంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న తనకు టికెట్ ఇవ్వాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆయన ఎంత విజ్ఞప్తి చేసినప్పటికీ అధిష్టానం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైపే మొగ్గు చూపడంతో చలమల కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కోసం ఎంత కష్టపడినా తనకు ప్రతిఫలం లేదని ఆయన తీవ్ర ఆవేదనలో ఉన్నారు. మరి ఆయన ఇండిపెండెంట్ గా ఎన్నికల బరిలోకి దిగుతారా లేకుంటే కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు ఆయనను బుజ్జగిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications