ముస్లింలే ఎక్కువ కండోమ్స్ వాడుతున్నారు: మోడీ వ్యాఖ్యలకు అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో చేసిన 'ఎక్కువ పిల్లలు ఉన్నవారు' అనే వ్యాఖ్యలకు ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. ముస్లిం సమాజంలోని పురుషులు ఎక్కువగా కండోమ్ లను వినియోగిస్తున్నారని, చైల్డ్ స్పేసింగ్ లో ఎక్కువ రికార్డు కలిగి ఉన్నారని పేర్కొన్నారు.
ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని పుట్టిస్తున్నారని మోడీ చెబుతున్నారు. నరేంద్ర మోడీకి ఆరుగురు సోదరులు, అమిత్ షాకు ఆరుగురు సోదరీమణులు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కి 10-12 మంది సోదరీమణులు ఉన్నారు అని అసదుద్దీన్ ఒవైసీ చెప్పుకొచ్చారు. అంతేగాక, కేంద్ర గణాంకాల ప్రకారం ముస్లింల సంతానోత్పత్తి రేటు తగ్గుముఖం పడుతోందన్నారు.

కానీ, హిందూ సోదరుల్లో భయాన్ని సృష్టించేందుకు నరేంద్ర మోడీ ద్వేషాన్ని పెంచుతున్నారని అసదుద్దీన్ ఆరోపించారు. ఈ దేశంలో ముస్లింలు ఎప్పటికీ మెజార్టీగా ఉండరని, ముస్లింల పట్ల ఈ భయాన్ని మీరు ఎంత కాలం కొనసాగిస్తారు? అని మోడీని ఒవైసీ ప్రశ్నించారు. ప్రధాని మోడీ 17 కోట్ల భారతీయ ముస్లింలను చొరబాటుదారులని పిలిచారని ఆరోపించారు.
అంతకుముందు హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత బాణం వేసినట్లు సంజ్ఞ చేయడాన్ని ఒవైసీ విమర్శించారు. ఇది మసీదుపై బాణం వేయడం కాదని, నగరంలో శాంతిని నాశనం చేయడానికి లక్ష్యంగా చేసుకున్న ప్రయత్నమని ఒవైసీ ఆరోపించారు.
కాగా, కాంగ్రెస్ మేనిఫెస్టోలోని సంపద పునర్విభజన అనే హామీని ప్రస్తావిస్తూ.. ప్రధాని మోడీ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దేశంలోని ప్రజల సంపదను చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి పంచుతారా? అని ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ సహా విపక్షాలు మోడీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ క్రమంలో దేశంలోని వనరులపై ముస్లింలకే తొలి హక్కు అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బీజేపీ కౌంటర్లు ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications