‘ఇబ్బంది పడినా! మోడీ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు’
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని భారతీయ జనతా పార్టీ నేత నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు మోడీ తీసుకున్న నిర్ణయాన్ని దేశ ప్రజలు స్వాగతిస్తున్నారని నాగం జనార్ధన్‌రెడ్డి అన్నారు.
నగదు కోసం ఇబ్బందులు పడుతున్నా.. దేశహితం కోసం ప్రజలు మోడీకి బాసటగా నిలుస్తున్నారని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. మోడీ చర్యలను తప్పుబడుతున్న వారు నల్ల కుబేరులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా అనిపిస్తోందన్నారు.

పెద్దనోట్లు రద్దుతో రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం సరికాదని, నల్లధనంతో ప్రభుత్వాన్ని నడపాల్సిన దుస్థితి ఉండకూడదని అన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ పేద రాష్ట్రంగా మార్చేశారని నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు.
మంగళవారం నుంచి కొత్త రూ.500నోట్లు కూడా బ్యాంకుల ద్వారా ప్రజలకు అందుతాయని నాగం జనార్ధన్‌రెడ్డి చెప్పారు. ప్రతిపక్షాలు చెబుతున్నట్లుగా.. ప్రధాని ముందే చెప్పి నోట్లను రద్దు చేస్తే నల్లధనం బయటకు వచ్చేది కాదని నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications