Nagarjunasagar dam: ఏపీ పోలీసులపై కేసు నమోదు చేసిన తెలంగాణా పోలీసులు!!
ఏపీ తెలంగాణా రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న తాజా సాగర్ వివాదం నేపధ్యంలో నాగార్జునసాగర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు నిర్వాహణ తెలంగాణ అధ్వర్యంలో ఉన్నప్పటికి నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ ఆంధ్రా పోలీసులు 13వ గేటు వరకు తమ ఆధీనంలోకి తీసుకుని నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టులోని ప్రస్తుత నీటి నిల్వ 522 అడుగులకు చేరింది.
నీటి విడుదల ఇలాగే కొనసాగితే ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ కు చేరే అవకాశం ఉంది. తెలంగాణ పోలీస్ అధికారులు పరిస్థితి గురించి ఉన్నతాధికారులకు వివరించారు. దీనిపై కృష్ణా ట్రిబ్యునల్ కు తెలంగాణ అధికారులు ఫిర్యాదు చేశారు. కేంద్రం కూడా ఈ వివాదం పై ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులను సమాచారం కోరినట్లు సమాచారం. ప్రస్తుతం డ్యామ్ కు ఇరువైపులా రెండు రాష్ట్రాలు భారీగా పోలీసులను మోహరించాయి.

ఇదిలా ఉంటే దౌర్జన్యంగా నాగార్జునసాగర్ 13 వ గేట్ వరకు తమ అధీనంలోకి తీసుకున్నారని ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు నాగార్జున సాగర్ విజయపురి టౌన్ పిఎస్ లో కేసు నమోదయింది. ఈ కేసులో ఏ 1 గా ఏపీ పోలీస్ ఫోర్స్ ను పేర్కొంటూ కేసు నమోదు చేశారు.
తెలంగాణ భూభాగంలోకి దౌర్జన్యంగా చొచ్చుకొచ్చారు అని తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఏపీ పోలీసులపై ఫిర్యాదు చేసింది. ప్రధాన డ్యాం లోని 13 నుంచి 26 గేట్ల వరకు ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారని కూడా తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ తమ ఫిర్యాదులో పేర్కొంది.
కుడి కాల్వ 5వ గేట్ నుంచి ఏపీకి కృష్ణా జలాలను వదిలారని పేర్కొన్నారు. ఇక ఈ ఫిర్యాదుతో 447, 427 సెక్షన్ల కింద ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. మరి ఈ వ్యవహారం చిలికి చిలికి గాలి వానలా మారుతున్న వేళ రెండు రాష్ట్రాల మధ్య ఏం జరగబోతుంది అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.












Click it and Unblock the Notifications