రూ.5లక్షలు తగలబెట్టిన టీఆర్ఎస్ నేత... ఏసీబీ అధికారులు వస్తున్నారని తెలిసి...
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఓ టీఆర్ఎస్ నాయకుడు రూ.5లక్షలు తగలబెట్టాడు. ఏసీబీ అధికారులు తన ఇంటి మీద దాడులకు వస్తున్నారని తెలిసి నోట్ల కట్టలకు నిప్పంటించేశాడు. క్రషర్ మిషన్,మైనింగ్ అనుమతుల కోసం ఓ వ్యక్తి వెల్దండ తహశీల్దార్‌ను సంప్రదించగా... స్థానిక టీఆర్ఎస్ నాయకుడికి రూ.5లక్షలు లంచం ఇవ్వాలని ఆయన సూచించాడు. దీంతో ఈ విషయాన్ని బాధితుడు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్‌తో బాధితుడితో డబ్బు పంపించి... ఆ వెంటనే టీఆర్ఎస్ నాయకుడి ఇంటిపై దాడులు చేశారు.అధికారులు వస్తున్నారని తెలిసి... ఆ నాయకుడు నోట్ల కట్టలను కాల్చేశాడు.


అసలేం జరిగింది...
నాగర్‌కర్నూల్ జిల్లా తలకొండపల్లి మండలం కోరింత తండాకు చెందిన రాములు నాయక్‌కు వెల్దండ మండలంలోని బెల్లంపల్లి గ్రామంలో 15 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ పొలంలో క్రషర్ మిషన్ ఏర్పాటు,మైనింగ్ అనుమతుల కోసం సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే స్థానిక తహశీల్దార్ నుంచి ఎన్ఓసీ(నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్) తీసుకురావాలని మైనింగ్ అధికారులు నాయక్‌తో చెప్పారు. దీంతో రాములు నాయక్ ఎన్ఓసీ కోసం తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నాడు.

రూ.5లక్షలకు ఒప్పందం...
ఈ క్రమంలో రాములు నాయక్‌ను పిలిపించుకున్న తహశీల్దార్ సైదులు గౌడ్... ఎన్ఓసీ రావాలంటే ముందు టీఆర్ఎస్ నేత,మాజీ వైఎస్ ఎంపీపీ వెంకటయ్య గౌడ్‌ను కలవాలని సూచించాడు. దీంతో నాయక్ వెంకటయ్య గౌడ్‌ను కలవగా... ఎన్‌ఓసీ రావాలంటే రూ.5లక్షలు ఇవ్వాలని తహశీల్దార్ డిమాండ్ చేస్తున్నట్లు చెప్పాడు. అంత మొత్తం ఇస్తేనే తహశీల్దార్ త్వరగా ఎన్ఓసీ ఇస్తాడని చెప్పాడు. అలా చివరకు రూ.5లక్షలకు ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది.

పక్కా ప్లాన్‌తో రంగంలోకి ఏసీబీ
వెంకటయ్య గౌడ్‌తో ఒప్పందం తర్వాత రాములు నాయక్ ఏసీబీ అధికారులను సంప్రదించి... వారికి విషయం చెప్పాడు. దీంతో ఏసీబీ అధికారులు వెంకటయ్య గౌడ్‌ను పట్టుకునేందుకు పక్కా ప్లాన్ రూపొందించారు. ముందుగా రూ.5లక్షలు రాములు నాయక్‌తో పంపించారు. ఆ డబ్బును అతను కల్వకుర్తిలో ఉన్న వెంకటయ్య గౌడ్ ఇంటికి వెళ్లి అతనికి ఇచ్చాడు. రాములు నాయక్ ఆ ఇంటి నుంచి బయటకొచ్చిన వెంటనే ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలకు వెళ్లారు.

నోట్ల కట్టలు తగలబెట్టిన వెంకటయ్య గౌడ్...
అధికారులు వచ్చారని తెలుసుకున్న వెంకటయ్య గౌడ్ తలుపులు మూసుకున్నాడు. రాములు నాయక్ ఇచ్చిన రూ.5లక్షలకు నిప్పంటించి తగలబెట్టాడు. ఇంతలో ఏసీబీ అధికారులు తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లడంతో కరెన్సీ నోట్లు మంటల్లో తగలబడుతూ కనిపించాయి. వెంటనే మంటలు చల్లార్చగా... అప్పటికే ఆ నోట్లు 70శాతం కాలిపోయాయి. ఆ డబ్బును స్వాధీనం చేసుకుని వెంకటయ్య గౌడ్‌తో పాటు తహశీల్దార్ సైదులు గౌడ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వెల్దండ తహశీల్దార్ కార్యాలయంతో పాటు హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని తహశీల్దార్ సైదులు గౌడ్ నివాసంలో దాడులు జరుగుతున్నట్లు సమాచారం.