నయీం చిన్ననాడు ఇలా.. చిలిపి పనులు, పాములతో బెదిరించేవాడు
నల్గొండ: గ్యాంగ్ స్టర్ నయీం గురించి అతను చనిపోయిన తర్వాత ఎన్నో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా, నయీం చిన్న నాటి స్నేహితుడు రామకృష్ణ ఓ టీవీ ఛానల్‌తో నయీం చిన్నప్పుడు ఎలా ఉండేవాడు, అతను ఎప్పుడు క్రూరంగా మారాడు.. అనే విషయాలను చెప్పారు.
చిలిపి పనులు మాత్రమే
నయీం చిన్నప్పుడు చాలా మంచిగా ఉండేవాడని ఉండేవాడని రామకృష్ణ చెప్పారు. డిగ్రీ సమయంలో నయీం తనకు స్నేహితుడు అన్నారు. డిగ్రీ చదివిన మూడేళ్ల పాటు తనకు మంచి మిత్రుడిగా ఉన్నాడని చెప్పారు. చిలిపి పనులు మినహా అందరితోను స్నేహంగా ఉండేవాడన్నారు.
చెల్లెలు వ్యవహారంలో జైలుకు.. అక్కడే మార్పు
ఆ తర్వాత కొద్ది రోజులకు మారిపోయాడని చెప్పారు. నయీం చెల్లెలుకు చెందిన ఓ గొడవ వ్యవహారంలో అతను జైలుకు వెళ్లాడని చెప్పారు. నయీం సోదరి ఓ వ్యక్తిని ప్రేమించిందని, దీంతో నయీం ప్రేమించిన వ్యక్తిని బెదిరించాడని చెప్పారు. అతనిని కొట్టినందుకు నయీం జైలుకెళ్లాడని చెప్పారు.

జైలులో మావోయిస్టులు, నక్సలైట్లతో నయీంకు పరిచయం ఏర్పడిందని చెప్పారు. ఆ తర్వాత కాలంలో నయీం క్రూరంగా మారిపోయాడని చెప్పారు. డిగ్రీ పరీక్షలు రాశాక అతను జైలుకు వెళ్లాడని చెప్పారు.
పాములతో బెదిరించేవాడు.. పోలీస్ అధికారుల అండ
నయీం వసూళ్లకు పాల్పడేవాడని, పాములతో బెదిరించడం చేసేవాడని చెప్పారు. కాలేజీ చివరి రోజుల్లోను క్రూరంగా ప్రవర్తించేవాడన్నారు. తమ స్నేహం కేవలం డిగ్రీ చదివిన మూడేళ్లు మాత్రమే కొనసాగిందన్నారు. పోలీసు ఉన్నతాధికారుల సహకారంతో నయీం ఈ స్థాయికి ఎదిగాడన్నారు. స్థానిక పోలీసులు అతని ఆగడాలకు అడ్డుకట్ట వేయాలనుకున్నా కుదరలేదన్నారు.
తమ మధ్య మంచి స్నేహం ఉండేదని, అయితే, ఎవరో నయీంకు తన గురించి లేనివి చెప్పారని, దాంతో తమ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయన్నారు. తమ బంధువులకు చెందిన భూమి విషయంలో నయీంతో గొడవ జరిగిందని, తాను ఆ వివాదంలో లేకున్నప్పటికీ, తానే వెనుక ఉండి నడిపిస్తున్నట్లుగా నయీంకు ఎవరో చెప్పారన్నారు.
తన సోదరుడిని దారుణంగా హతమార్చాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనను కూడా బెదిరించాడన్నారు. 2005లో తాను చివరిసారి శంషాబాదులోని అతని ఫాంహౌస్‌లో నయీంను కలిశానని చెప్పారు. తన కుటుంబం జోలికి రావొద్దని విజ్ఞప్తి చేశానని చెప్పారు.
డబ్బు పిచ్చి, చెట్టు పోయినా
నయీంకు ఉన్న డబ్బు పిచ్చి అతనిని ఈ స్థాయికి దిగజార్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. గత కొన్ని నెలల్లోనే భువనగిరిలో పెద్ద మొత్తంలో అతను వసూలు చేసినట్లుగా తెలుస్తోందన్నారు. ఇప్పుడు చెట్టు పోయినా (నయీం చనిపోయినా) వేర్లు (అనుచరులు) ఉన్నాయని, అవి బలమైనవని, వారి పైన చర్యలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications