'టీ' ఘనత సోనియాదే: నాయిని, మారనని కృష్ణయ్య
హైదరాబాద్: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు ఎంతో రుణమపడి ఉన్నారని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి మంగళవారం అన్నారు. 2009లో మొదట ప్రకటించినప్పుడే తెలంగాణ వచ్చేదని, అయితే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రస్తుత కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు దానిని అడ్డుకున్నారని ఆరోపించారు.
వారి అడ్డంకులను లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ప్రకటించారన్నారు. ఆ ఘనత ఆమెకే దక్కుతుందని నాయిని కితాబిచ్చారు. మంగళవారం నాడు తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని, ఆయన ప్రసంగించారు.
మరో కార్యక్రమంలో మాట్లాడుతూ... రేషన్ పంపిణీలో అవకతవకలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నాయిని హెచ్చరించారు. రేషన్‌డీలర్లు కూడా పేదవారేనని వారికి ప్రజలు కూడా సహకరించాలని సూచించారు. డీలర్లు అవకతవకలకు పాల్పడకుండా పేదల సరుకులను సక్రమంగా అందజేయాలన్నారు. గతంలో రేషన్ బియ్యాన్ని హాస్టళ్లకు దారి మళ్లించేవారని, ఇప్పుడా పరిస్థితి ఉండదని తెలిపారు.

రాబోయే మూడు నెలల్లో పింఛను రాని ఇల్లంటూ ఉండదని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పష్టం చేశారు. ఫించన్ల విచారణ ఇంకా పూర్తి అవ్వలేదని తెలిపారు. ఆహార భద్రతకార్డులు, పింఛన్ల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
పార్టీ మారను: ఆర్ కృష్ణయ్య
తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మంగళవారం అన్నారు. తాను టీడీపీని వీడుతున్నట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీలో చేరిన ఆర్ కృష్ణయ్య ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు.












Click it and Unblock the Notifications