రేవంత్ రెడ్డి అలా జైలుకెళ్లాడు.. ఇలా సీఎం అయ్యాడు
Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పాలనపై తనదైన ముద్ర వేస్తోన్నారు. శాంతి భద్రతలు, ప్రజా సమస్యల పరిష్కారం, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాల కల్పన, ఎన్నికల ప్రచార సమయంలో ప్రకటించిన ఆరు ఉచిత గ్యారంటీల అమలు.. వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు.
ఆయన పరిపాలన విధానం.. జాతీయ స్థాయి ప్రతిపక్షాల కూటమి ఇండియా నేతలను ఆకట్టుకుంటోంది. రేవంత్ పాలనను ఇండియా నేతలు మెచ్చుకుంటోన్నారు. రేవంత్ రెడ్డిని పోరాట యోధుడిగా అభివర్ణిస్తోన్నారు. దక్షిణాదిన కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన నాయకుడిగా ప్రశంసిస్తోన్నారు.

రేవంత్ రెడ్డిపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సూలే ప్రశంసల వర్షాన్ని కురిపించారు. లోక్‌సభ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో తన సొంత నియోజకవర్గం బారామతిలో ఎన్సీపీ నేతలతో సమావేశం అయ్యారామె. మహారాష్ట్ర భవిష్యత్ ముఖ్యమంత్రి అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలకు స్పందించారు.
తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అవుతానా? లేదా? అనేది పక్కనపెడితే తన స్నేహితుడు రేవంత్ రెడ్డి తెలంగాణకు సీఎం అయ్యారని గుర్తు చేశారు. భారతీయ జనతా పార్టీ హైకమాండ్ నుంచి ఎదురైన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని రేవంత్ రెడ్డి నిలిచారని, కాంగ్రెస్‌కు ఘన విజయాన్ని అందించారని అన్నారు.
వివాదాస్పద కేసుల్లో రేవంత్ రెడ్డి జైలు జీవితాన్ని గడిపారని, బయటికి వచ్చిన తరువాత నిత్యం ప్రజల్లో ఉంటూ నాయకుడిగా ఎదిగారని, ముఖ్యమంత్రి పదవి ఆయనను వెదుక్కుంటూ వచ్చిందని చెప్పారు. రేవంత్ రెడ్డి తనతో పాటు లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారని, ఆయనతో తనకు మంచి పరిచయం ఉందని సుప్రియా సూలే అన్నారు. ఏదో ఒకరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అవుతావని తాను చాలాసార్లు రేవంత్‌తో చెప్పానని, అది వాస్తవ రూపాన్ని దాల్చిందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications