అధికార పార్టీలో కొత్త ట్రెండ్.. మా ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వొద్దు..!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల తీరుపై సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. వచ్చే ఎన్నికలలో మా ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వద్దు అంటూ అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూ కొత్త ట్రెండ్ ను సృష్టిస్తున్నారు.
ఉదాహరణకు ఉమ్మడి వరంగల్ జిల్లా చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కు టికెట్ ఇవ్వద్దని ఇప్పటికీ సొంతపార్టీ నేతలు ఇటీవల కేటీఆర్ పర్యటనలో తమ గోడు వెళ్లబోసుకున్నారని సమాచారం. నన్నపునేని నరేందర్ కు తప్ప ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం సహకరిస్తామని గెలిచేలా చూస్తామని కానీ నన్నపునేని నరేందర్ కు టికెట్ ఇస్తే మాత్రం తాము సహకరించేది లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం.

ఇదిలా ఉంటే వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దు అంటూ నియోజకవర్గానికి చెందిన కీలక నేతలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆరూరి రమేష్ సొంత పార్టీ నేతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు.
ఉద్యమకారులను అవమానిస్తున్నారని, ఇటీవల సర్పంచులను దుర్భాషలాడిన ఆడియో రికార్డ్ సైతం వైరల్ గా మారిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆరూరి రమేష్ కు టికెట్ ఇవ్వకుండా అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లాలని కోరారు. డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ రావు, జిల్లా రైతుబంధు సమన్వయకర్త లలిత యాదవ్ తో పాటు, పలువురు కార్పొరేటర్లు, కీలక నాయకులు రమేష్ కు టికెట్ ఇవ్వద్దని మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
ఇక మరో వైపు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పైన కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. బీఆర్ఎస్ పార్టీ నుండి తెలంగాణ ఉద్యమకారులను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వర్గం సస్పెండ్ చేయాలి అనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ ఇటీవల ధర్మారం జంక్షన్లో ఉద్యమకారులు ఆందోళన నిర్వహించారు.
చల్లా ధర్మారెడ్డి పైన కూడా సొంత పార్టీ నేతలు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఆయనకు సైతం టికెట్ ఇవ్వద్దు అన్న డిమాండ్ వినిపిస్తుంది. వరంగల్ జిల్లా మాత్రమే కాకుండా, కోదాడ, భోధన్ ఇలా రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల మా ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వద్దు అంటూ బీఆర్ఎస్ పార్టీ నేతల నుంచి అధిష్టానానికి విజ్ఞప్తులు వెల్లువగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications