ఏం జరిగి ఉంటుంది?: అర్థరాత్రి.. ఎర్రగడ్డలో వివాహిత సజీవ దహనం?
హైదరాబాద్: ఎర్రగడ్డలో సౌమ్య అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఆమె నివసిస్తున్న ఫ్లాట్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో.. చుట్టుపక్కల వారు అప్రమత్తయ్యారు.
వెంటనే ఇంటి తలుపులు పగలగొట్టగా.. ఒంటికి నిప్పంటుకుని మంటల్లో కాలిపోతూ కనిపించింది సౌమ్య. రెండేళ్ల కొడుకు ముందే ఈ అఘాయిత్యం జరగడం వారిని ఆశ్చర్యపరిచింది. బిందెలతో నీళ్లు తీసుకొచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పటికే శరీరమంతా కాలిపోవడంతో ఆమె మృతి చెందినట్టు తెలుస్తోంది.

ఆపై స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. ఆమె ఒంటిపై కెమికల్ మరకలను గుర్తించారు. సౌమ్య ఒకవేళ ఆత్మహత్యకు పాల్పడి ఉంటే.. ఇంటి బయట గడియ ఎవరు పెట్టారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సౌమ్యది ఆత్మహత్యా?.. లేక హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
కాగా, సౌమ్యకు విశాఖపట్నంకు చెందిన నాగభూషణంతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. ఎల్&టీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అతను.. మంగళవారం రాత్రి 8గం. సమయంలో విధులకు వెళ్లిపోయాడు.
ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. అర్థరాత్రి సమయంలో సౌమ్య మంటల్లో తగలబడి సజీవ దహనమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భర్తను, కుటుంబ సభ్యులను విచారించనున్నారు.












Click it and Unblock the Notifications