రైలు నుంచి జారిపడి కొత్తగా పెళ్లైన జంట మృతి..!
యాదాద్రి భువనగిరి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి నవ దంపతులు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతులను ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన కోరాడ సింహాచలం (25), భవాని (19)గా గుర్తించారు. దీంతో రెండు నెలల క్రితమే కొత్తగా పెళ్లైన జంట ఈ రకంగా అకాల మరణం చెందడం సర్వత్రా విషాదం నింపుతోంది.
కాగా గరుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన సింహాచలం.. అదే జిల్లాలోని అంకవరం గ్రామానికి చెందిన భవానితో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. సింహాచలం హైదరాబాద్‌లోని ఓ రసాయన పరిశ్రమలో ఉద్యోగం చేస్తుండగా, భార్య భవానితో కలిసి జగద్గిరిగుట్టలోని గాంధీనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు గురువారం రాత్రి సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరారు.

రైలు వంగపల్లి రైల్వే స్టేషన్ దాటిన కొద్దిసేపటికే, కోచ్ డోర్ వద్ద నిలబడి ఉన్న సమయంలో ఇద్దరూ నియంత్రణ కోల్పోయి రైలు నుంచి కింద పడిపోయినట్లు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే శుక్రవారం ఉదయం విధుల్లో ఉన్న ట్రాక్‌మన్‌లు రైల్వే ట్రాక్ పక్కన మృతదేహాలను గమనించి.. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు.
వివాహం జరిగి కొద్దికాలమే అవుతున్న తరుణంలో.. ఈ దుర్ఘటన చోటు చేసుకోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతుల కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి వారి సొంత గ్రామాలకు తరలించనున్నారు. ఈ ఘటనపై భువనగిరి రైల్వే జీఆర్పీ ఇన్‌ఛార్జ్ కృష్ణారావు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతి చెందిన వారు కోచ్ డోర్ వద్ద నిలబడిన కారణాలు ? ప్రమాదవశాత్తు జారిపడ్డారా? మరేదైనా కారణం ఉందా?అనే అంశాలపై విచారణ చేపట్టినట్టు వెల్లడించారు. ఈ మేరకు సీసీటీవీ ఫుటేజ్‌లు, రైల్వే సిబ్బంది వాంగ్మూలాలతో దర్యాప్తు కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications