ఐదు రోజులపాటు భారీ వర్షాలు: తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణ రాష్ట్రంలో రాగల ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే గురువారం సాయంత్రం నుంచి హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గురువారంనాడు మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

రానున్న ఐదు రోజుల పాటు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. బుధవారం తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాలలో కొనసాగిన ఆవర్తనం ఈ రోజు మధ్యప్రదేశ్ యొక్క నైరుతి ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు పేర్కొంది. ఈరోజు రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నట్లు వెల్లడించింది.
ఈసారి ముందుగానే కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు
భారత వాతావరణ శాఖ(IMD) రైతులకు, ప్రజలకు చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు మే 31 నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేసింది. నాలుగు రోజులు అటూ ఇటూగా రుతుపవనాలు భారతదేశ ప్రధాన భూభాగాన్ని తాకనున్నాయని వాతావరణశాఖ బుధవారం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న దేశంలోకి ప్రవేశిస్తాయి.
తెలంగాణకు పది రోజుల ముందుగానే రుతుపవనాలు
తెలంగాణకు పది రోజుల ముందుగానే రుతుపవనాలు రానున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈదురుగాలులు కూడా వీస్తాయని వెల్లడించింది. హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.












Click it and Unblock the Notifications