తెలంగాణలో 4 రోజులు అత్యంత భారీ వర్షాలు: ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంతోపాటు ఇతర జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం చల్లగా ఉంటోంది. తాజాగా, మరోసారి వాతావరణ శాఖ వర్ష సూచనలు చేసింది. రాష్ట్రంలో రాగల నాలుగు రోజుల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
దక్షిణ, పరిసర ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని అనుబంధ ఆవర్తనం మధ్య ట్రోపోస్పీయర్ వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.

గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. గురువారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంటూ ఈ రెండు జిల్లాలకు రెడ్ హెచ్చరికలను జారీ చేసింది. ఈ రెండు జిల్లాలకు సంబంధించిన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు పంపించింది. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించింది.
మరోవైపు, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
శుక్రవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న క్రమంలో ప్రజలు, వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.












Click it and Unblock the Notifications