తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు: పలు చోట్ల వడగళ్లు, ఈదురుగాలులు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నగరంతోపాటు ఇతర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా వరుసగా వానలు పడుతున్నాయి. అయితే, రానున్న మూడు రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆదిలాబాద్, కొమురంభీ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ శుక్రవారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది.

ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అంచనా వేసింది వాతావరణ శాఖ. మిగిలిన జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారంనాడు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, వరంగల్, హనుమకొండ, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమరంభీమ్ అసిఫాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆదివారం అంటే ఏప్రిల్ 9న మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్, కొమురంభీం అసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈదురుగాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు. ఇక ఏప్రిల్ 10 నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.












Click it and Unblock the Notifications