తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు: కీలక ఆధారాలు సేకరణ
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని 31 ప్రాంతాల్లో ఉన్న పౌర హక్కులు, ప్రజా సంఘాల నేతల నివాసాల్లో సోదాలు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వెల్లడించింది. తెలంగాణలోని రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మెదక్ తోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, కర్నూలు, కడప జిల్లాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.

సోదాల్లో 40 సెల్‌ఫోన్లు, 44 సిమ్ కార్డులు, 70 హార్డ్ డిస్కులు, మైక్రో ఎస్డీ కార్డులు, 19 పెన్ డ్రైవ్‌లు, ఆడియో రికార్డర్స్, ఆయుధాలు, మావోయిస్టు సాహిత్యం, జెండాలు, ప్రెస్ నోట్లతోపాటు రూ. 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. తెలంగాణలో పలువురు పౌరహక్కులు, ప్రజా సంఘాల నేతల ఇళ్లల్లో బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 3 గంటల వరకు ఎన్ఐఏ సోదాలు నిర్వహించారు.
తెలంగాణకు చెందిన లాయర్ రఘునాథ్, డప్పు రమేశ్, జాన్, మహిళా సంఘం కార్యకర్త శిల్ప ఇళ్లల్లో తెల్లవారుజాము వరకు ఎన్ఐఏ అధికారులు సోదాలో చేశారు. ఆ తర్వాత నలుగురికి నోటీసులు ఇచ్చారు. హైకోర్టులో కేసులున్నందున ఏప్రిల్ 3న తేదీన హాజరవుతానని న్యాయవాది రఘునాథ్ ఎన్ఐఏ అధికారులకు విజ్ఞప్తి చేయడంతో అందుకు వారు అంగీకరించారు. కాగా, ఎన్ఐఏ సోదాలు నిర్వహించడంపై ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘం నేతలు తీవ్రంగా ఖండించారు. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించివేస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications