కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బస్సులు రాక గ్రామాల్లో పెరిగిన ప్రజల ఇక్కట్లు

రాష్ట్రంలో ఆర్టీసీ డిపో లేని జిల్లా కేంద్రం పెద్దపల్లి ఒక్కటే...ఇక్కడ డిపో ఏర్పాటుకు నాయకులు పదేళ్లుగా ప్రయత్నిస్తున్నప్పటికీ సఫలం కాలేదు...

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: రాష్ట్రంలో ఆర్టీసీ డిపో లేని జిల్లా కేంద్రం పెద్దపల్లి ఒక్కటే... ఇక్కడ డిపో ఏర్పాటుకు నాయకులు పదేళ్లుగా ప్రయత్నిస్తున్నప్పటికీ సఫలం కాలేదు... ఆర్టీసీ ఛైర్మన్‌గా పెద్దపల్లి జిల్లాకే చెందిన సోమారపు సత్యనారాయణ ఉన్నా సంస్థ నష్టాల్లో ఉండడంతో డిపో ఏర్పాటు ప్రక్రియ చేపట్టలేమని తేల్చేశారు.

జిల్లా మొదటి సమీక్ష సమావేశంలోనే ఈ మేరకు ప్రకటించడంతో జిల్లా కేంద్ర ప్రజల్లో నిరాశ అలుముకుంది. అయితే పెరిగిన అవసరాలు, ప్రజాసంక్షేమం కోసం డిపో ఏర్పాటుపై అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రజల అవసరాల కోసం ఆర్టీసీ సంస్థ ఏర్పాటు చేసిన 'బస్‌హబ్‌' కూడా మున్నాళ్ల ముచ్చటగానే మారింది. దానిని కొన్ని నెలలకే ఎత్తివేయడంతో పెద్దపల్లిపై ఆర్టీసీ అధికారుల ఆంతర్యం ఏమిటో అంతు చిక్కడం లేదు.

 ఎనిమిది మండలాల నుంచి జిల్లా కేంద్రానికి బస్సులు

ఎనిమిది మండలాల నుంచి జిల్లా కేంద్రానికి బస్సులు

గోదావరిఖని డిపో అధికారులు రామగుండం, కమాన్‌పూర్‌, ముత్తారం, ధర్మారం మండలాలకు చెందిన గ్రామాలకు నడిపే బస్సులను పెద్దపల్లి జిల్లా కేంద్రానికి సంబంధం లేకుండా నడుపుతున్నారు. ఆయా మండలాలు, గ్రామాలకు చెందిన ప్రజలు పెద్దపల్లికి వచ్చేందుకు రెండుసార్లు బస్సులు మరాల్సి వస్తుంది. లేదంటే ఆటోలు, ప్రైవేటు వాహనాలు తప్ప గత్యంతరం లేదు. మంథని డిపో అధికారులు ముత్తారం, శ్రీరాంపూర్‌ మండలాలకు అదేరీతిని సేవలు అందిస్తున్నారు. ఇక కరీంనగర్‌ డిపో అధికారులు జూలపల్లి, ఓదెల, శ్రీరాంపూర్‌, ఎలిగేడు మీదుగా నడిచే బస్సులేవి పెద్దపల్లికి చేరవు. దీంతో ఈ గ్రామాలకు చెందిన ప్రజలు కూడా రెండు బస్సులు మారితే తప్ప పెద్దపల్లికి చేరే పరిస్థితి లేదు. జిల్లాలోని 14 మండలాల్లో జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ఎనిమిది మండలాల నుంచి మాత్రమే ఆర్టీసీ సేవలు అందుబాటులో ఉన్నాయి.

రెండు బస్సులు మారితేనే జిల్లా కేంద్రం

రెండు బస్సులు మారితేనే జిల్లా కేంద్రం

పెద్దపల్లి జిల్లాలోని అతి పెద్దదైన రామగుండం మండల కేంద్రం నుంచి కూడా పెద్దపల్లికి నేరుగా బస్సులేదు. రామగుండంతో పాటు అంతర్గాం, పాలకుర్తి, ముత్తారం, ఎలిగేడు, ఓదెల, మండల కేంద్రాలు ప్రధానమైన గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి రావడానికి రెండు వాహనాలు మారాల్సిందే. ఈ మండల కేంద్రాలన్నీ కూడా జిల్లా కేంద్రానికి కేవలం 16 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి.

ఆటోల్లో తప్పని ప్రయాణం

పెద్దపల్లి నుంచి ప్రతి మండలానికి ఆటోలతోనే అనుసంధానం కొనసాగుతుంది. ఆటోలో ప్రయాణం ప్రమాదకరమైనా తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ధర్మారం నుంచి పెద్దపల్లికి 20 జీపులు, మధ్యలోని ఒక్కో గ్రామం నుంచి కనీసం 20 ఆటోలు పెద్దపల్లి వైపు నడుస్తున్నాయి. జూలపల్లి మండలంలోని ఒక్కో గ్రామం నుంచి 20 నుంచి 30 ఆటోలు, ఎలిగేడు మండలంలోని గ్రామాల్లో నుంచి 30 నుంచి 40 ఆటోలు, కమాన్‌పూర్‌, రామగిరి మండలం నుంచి రోజుకు 100 ఆటోలు నడుస్తున్నాయి.

లోపించిన సేవలు

సుల్తానాబాద్ మండలంలో 23 గ్రామాలు, 15 అనుబంధ గ్రామాలు ఉన్నాయి. అన్ని గ్రామాలకు రహదారులు ఉన్నాయి. 12 గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడవడం లేదు. దీంతో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు లేని కారణంగా ప్రైవేటు వాహనాలు, ఆటోలు, ఇసుక ట్రాక్టర్లు ఎక్కి మరీ ప్రయాణం కొనసాగిస్తున్నారు. సుల్తానాబాద్‌ నుంచి కాల్వశ్రీరాంపూర్‌, ఓదెలకు గంటకు ఒక బస్సు ఉండటం కారణంగా ఎక్కువగా ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. నారాయణపూర్‌, కొదురుపాకకు ఉదయం, సాయంత్రం పూట మాత్రమే బస్సు సౌకర్యం ఉంది.

 నామమాత్రంగా సేవలు

నామమాత్రంగా సేవలు

ఎలిగేడు శివపల్లి, బుర్హానిమియాపేట, లోకపేట గ్రామాలకు బస్సులు లేవు. ముప్పిరితోట, ర్యాకల్‌దేవ్‌పల్లి, సుల్తాన్‌పూర్‌ గ్రామాలకు విద్యార్థుల కోసం కరీంనగర్‌, సుల్తానాబాద్‌ మీదుగా ఒక్కో బస్సు నడుస్తుంది. సాయంత్రం కరీంనగర్‌ నుంచి ఎలిగేడు, ధూళికట్ట, కచాపూర్‌ మీదుగా పెద్దపల్లి వరకు నడిపిస్తున్నారు. కరీంనగర్‌ నుంచి నర్సాపూర్‌, ఎలిగేడు, లాలపల్లి మీదుగా జూలపల్లి వరకు మరో బస్సు నడుపుతున్నారు. ఒక్కో బస్సు నాలుగు ట్రిప్పుల చొప్పున నడుస్తున్నాయి.

జిల్లా కేంద్రానికే దూరం

శ్రీరాంపూర్‌ మండలంలోని 17 గ్రామాలకు నాలుగు డిపోలకు చెందిన బస్సులు సేవలు అందిస్తున్నాయి. పెద్దపల్లి మీదుగా గోదావరిఖని డిపో నడుపుతున్న నాలుగు ట్రిపుల బస్సు మాత్రమే జిల్లా కేంద్రం చేరడానికి మండల వాసులకు ప్రత్యామ్నాయం. కరీంనగర్‌ డిపో సుల్తానాబాద్‌ మీదుగా, గోదావరిఖని డిపో వారు ముత్తారం మీదుగా శ్రీరాంపూర్‌, జమ్మికుంట వరకు, మంథని డిపో నుంచి ముత్తారం మీదుగా శ్రీరాంపూర్‌, జమ్మికుంట వరకు, హుజురాబాద్‌ డిపో వారు జమ్మికుంట నుంచి శ్రీరాంపూర్‌ వరకు బస్సులను నడుపుతున్నారు. దీంతో ప్రజలు జిల్లా కేంద్రం వెళ్లడానికి ప్రైవేటు వాహనాలే శరణ్యం.

జూలపల్లికి రెండు ట్రిప్పులు

జూలపల్లికి కరీంనగర్‌, గోదావరిఖని డిపోలకు చెందిన బస్సులు, ఆర్నకొండ-జూలపల్లి బస్సు నాలుగు ట్రిప్పులు పెద్దపల్లి చొప్పదండి వయా జూలపల్లి వరకు బస్సు నాలుగు ట్రిప్పులు నడుపుతున్నారు. గతంలో పెద్దపల్లి నుంచి చొప్పదండికి రెండు బస్సులు ఏడు ట్రిప్పులు నడిచేవి. ప్రస్తుతం ఒక్క బస్సే నాలుగు ట్రిప్పులు నడుస్తోంది. నాగులపల్లి గ్రామానికి బస్సులు లేవు. అదే విధంగా మిగిలిన మండలాలకు కూడా ఇదే పరిస్థితి ఉంది.

బస్సులు ఎరుగని గ్రామాలు ఎన్నో

రూపునారాయణపేట, గూడెం, ఉప్పరపల్లె, హరిపురం, కొమిర గ్రామాలకు బస్సులు లేక స్థానికులు ప్రైవేటు వాహనాల్లో ప్రమాదకరంగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం హుజురాబాద్‌ డిపోనకు చెందిన నాలుగు బస్సులు జమ్మికుంట నుంచి మండలంలోని గుంపుల కనగర్తి మీదుగా సుల్తానాబాద్‌ వైపుకు పొద్దంతా నడుస్తున్నాయి. ఇదే డిపోకు చెందిన మరో బస్సు విద్యార్థులు, భక్తుల సౌకర్యం కోసం పొద్దున, సాయంత్రం వేళ ఒక్కో ట్రిప్పు చొప్పున మల్లన్న ఆలయానికి నడుపుతున్నారు. కరీంనగర్‌ డిపోనకు చెందిన రెండు బస్సులు కొలనూరు మీదుగా ఓదెల మండల కేంద్రానికి, కనగర్తి మీదుగా మల్లికార్జునస్వామి ఆలయం వరకు ఉదయం, సాయంత్రం ఒక్కో ట్రిప్పు చొప్పున నడుస్తున్నాయి.

 మూన్నాళ్లకే ఎత్తేసిన బస్‌హబ్‌

మూన్నాళ్లకే ఎత్తేసిన బస్‌హబ్‌

జిల్లా కేంద్రాన్ని ఆధారం చేసుకొని వివిధ రూట్లలో బస్సులు నడపాలనే ఉద్దేశంతో పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన ‘బస్‌హబ్‌' మున్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. వివిధ గ్రామాల నుంచి పెద్దపల్లికి వచ్చే ప్రయాణికుల సంఖ్య తగినంత ఉన్నా గోదావరిఖని డిపో నుంచి ప్రతిరోజు పెద్దపల్లికి బస్సులు తీసుకురావడం, ఇక్కడి నుంచి వివిధ రూట్లకు నడిపించడం అధికారులకు సమస్యగా మారింది. దీంతో బస్‌హబ్‌ను ఎత్తేసిన అధికారులు గతంలో మాదిరిగానే రూట్ల వారీగా వివిధ డిపోలకు చెందిన బస్సులతో జిల్లాను విభజిస్తున్నాయి. ్ద ధర్మారం నుంచి జగిత్యాలకు ప్రతి అరగంటకు ఒక బస్సు నడుపుతుండగా జిల్లా కేంద్రమైన పెద్దపల్లికి మాత్రం కేవలం రెండు బస్సులతో నాలుగు ట్రిప్పుల చొప్పున నడుపుతున్నారు. ్ద సుల్తానాబాద్‌, ఎలిగేడు, జూలపల్లి, ఓదెల మండలాలు కరీంనగర్‌-2 డిపో పరిధిలో కొనసాగుతున్నాయి. ఆయా మండలాలకు కరీంనగర్‌ నుంచే బస్సులు నడుస్తున్నాయి. కరీంనగర్‌ నుంచి ఎలిగేడు, పెద్దాపూర్‌, జూలపల్లి మీదుగా ఆర్టీసీ సేవలు అందుతున్నాయి. కానీ ఇటు వైపు నుంచి పెద్దపల్లికి బస్సులు నడవడం లేదు. ్ద జూలపల్లి మీదుగా చొప్పదండికి వెళ్లే ఏకైక బస్సు మాత్రమే మండలాన్ని పెద్దపల్లికి అనుసంధానం చేస్తుంది. ఓదెల, ఎలిగేడు మండలం నుంచి పెద్దపల్లికి అసలు బస్సు సౌకర్యమే లేదు. శ్రీరాంపూర్‌ మండలం నుంచి రెండు గోదావరిఖని బస్సులు, రెండు జమ్మికుంట బస్సులు సేవలు అందిస్తున్నాయి.్ద మంథని పరిధిలోని ముత్తారం, గోదావరిఖని డిపో పరిధిలోని అంతర్గాం, పాలకుర్తి మండల కేంద్రాల నుంచి పెద్దపల్లి కేంద్రానికి నడిపించేందుకు పాలకులు చొరవ చూపడం లేదు.

English summary
No bus facilities to villaged
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X