తెలుగు రాష్ట్రాలకు తప్పిన పెనుముప్పు
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. భారీ మొత్తంలో ఆస్తి, పంట నష్టం జరిగింది. మరో కొద్ది రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, తాజాగా, తెలుగు రాష్ట్రాలకు భారీ ముప్పు తప్పిందంటూ వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది.
ఏపీ, తెలంగాణకు వాయుగుండం ముప్పు తప్పిందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం రెండు మూడు రోజుల్లో వాయుగుండంగా మారి తీవ్రతరం కానుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

అయితే, ఆ వాయుగుండం వాయువ్యంగా పయనిస్తూ ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలకు చేరుకోనుందని తెలిపింది. దీంతో తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు తప్పినట్లయింది. కానీ, ఆగస్టు 8వ తేదీ వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. సాయంత్రం ఒక్కసారిగా మేఘావృతమై.. నగరంలోని చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. దీంతో విధులు ముగించుకుని, విద్యాలయాల నుంచి ఇంటికి వెళుతున్న ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
భారీ వర్షంతో నగరంలోని రహదారులపైకి వరదనీరు వచ్చి చేరడంతో వాహనదారులకు తిప్పలు తప్పలేదు. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్, యూసుఫ్ గూడ, బేగంపేట్, మెహదీపట్నం, ఎస్ఆర్ నగర్, కూకట్ పల్లి, బాచుపల్లి, ప్రగతినగర్, నిజాంపేట్, మియాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది.
లక్డీకపూల్, బషీర్‌బాగ్, లిబర్టీ వానపడుతున్నది. హిమాయత్‌నగర్, నారాయణగూడ, నాంపల్లి, అబిడ్స్, బోయినపల్లి, తిరుమలగిరి, మారేడుపల్లి, చిలుకలగూడ, సీతాఫల్‌మండి, అల్వాల్, పాట్నీ, ప్యారడైజ్, తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి పరిధిలోని కుత్బుల్లాపూర్, గుండ్లపోచంపల్లి, జీడిమెట్ల, బాలానగర్, దుండిగల్, సూరారం, బహదూర్‌పల్లి, జగద్గిరిగుట్ట, మల్లంపేటలోనూ వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
పలు ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురుస్తున్న క్రమంలో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. భారీ వర్షాలు, వరదలతో ఏవైనా సమస్యలుంటే వెంటనే 040-21111111 లేదా 9000113667 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణలో ఐదు రోజులపాటు భారీ వర్షాలు
తెలంగాణలో మరో ఐదురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో గురువారం నుంచి సెప్టెంబర్ 9 వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. గురువారం కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
శుక్రవారం ఆదిలాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ఆసిఫాబాద్, నిర్మల్,నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, భువనగిరి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములుమెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.












Click it and Unblock the Notifications