మాస్క్ లేకుండా రోడ్డెక్కుతున్నారా.. రూ.1000 జరిమానా తప్పదు.. హైదరాబాద్ పోలీస్ టఫ్ యాక్షన్..
రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తుండటంతో... పోలీసులు కఠినంగా నిబంధనలు అమలుచేస్తున్నారు. మాస్క్ ధరించకుండా రోడ్డు పైకి వచ్చేవారికి జరిమానా విధిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని షాపింగ్ మాల్స్,ప్రధాన కూడళ్లు,ఇతరత్రా చోట్ల పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మాస్క్ ధరించకుండా వచ్చేవారికి రూ.1000 జరిమానా విధిస్తున్నారు. మంగళవారం(మార్చి 30) జవహర్‌నగర్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మాస్క్ ధరించని 20 మందికి రూ.1000 చొప్పున జరిమానా విధించారు.

సరూర్ నగర్‌లో 18మందికి ఫైన్
'స్పెషల్ డ్రైవ్స్ ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. కరోనా కట్టడి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకే మాస్క్ ధరించనివారికి జరిమానా విధిస్తున్నాం.' అని జవహర్ నగర్ ఇన్‌స్పెక్టర్ పి.భిక్షపతి రావు తెలిపారు. రాచకొండ పరిధిలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ మంగళవారం(మార్చి 30) పోలీసులు 18 మందికి జరిమానా విధించారు. మాస్క్ ధరించకుండా రోడ్ల పైకి వచ్చినందుకు జరిమానా విధించినట్లు చెప్పారు.

కొత్తపేట,ఈసీఐఎల్‌లో అవగాహన కార్యక్రమాలు...
కొత్తపేట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నాగమల్లు తనదైన పాటలతో కరోనా కట్టడిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. మంగళవారం కొత్తపేటలో తన టీమ్‌తో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాస్కులు ధరించడం,భౌతిక దూరం పాటించడం,శానిటైజర్ వాడాల్సిన అవసరం గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు. అటు కుషాయిగూడలో ఏసీపీ కె శివకుమార్ తమ సిబ్బందితో కలిసి ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్‌లో కరోనా కట్టడిపై అవగాహన కల్పించారు. ఇప్పటినుంచి రెగ్యులర్‌గా తనిఖీలు చేస్తామని... మాస్కులు ధరించనివారికి జరిమానా తప్పదని హెచ్చరించారు.

మాస్కు తప్పనిసరి...
కరోనా కట్టడికి బహిరంగ ప్రదేశాలు,పని ప్రదేశాలు,ప్రయాణాల్లో మాస్కులు ధరించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే విపత్తు నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్ 51,60ల కింద శిక్షార్హులు అవుతారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్రంలోనూ మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విద్యా సంస్థలన్నింటినీ మూసివేసిన సంగతి తెలిసిందే. అలాగే ఏప్రిల్ 10వ తేదీ వరకు సామూహిక కార్యక్రమాలపై నిషేధం విధించింది. పండగలపై ఆంక్షలు విధించింది. ర్యాలీలు, యాత్రలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. హోళీ, శ్రీరామనవమి వేడుకల్లో జనాలు గుమిగూడవద్దని ఆదేశాలిచ్చింది . ప్రతి ఒక్కరు మాస్క్ లేకుండా బయట తిరగవద్దని తెలిపింది.












Click it and Unblock the Notifications