మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ దేనికి; కుక్కలు కూడా వారివెంట పడవు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ!!
తెలంగాణ రాష్ట్రంలో అసలు అధికారంలో లేక బీఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ తెగ మదన పడుతున్న వేళ, పుండు మీద కారం చల్లినట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఓటమికి గల అనేక కారణాలను ఆయన తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ, స్టేషన్ ఘనపూర్ మినహాయించి మిగతా పది స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం, బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలు కావడం పైన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లా ఆత్మ గౌరవం ఉన్న జిల్లా అని పేర్కొన్న తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఆత్మగౌరవం ఉన్న ప్రజలు జిల్లా మంత్రుల పట్ల అసహనంతో ఓటు వేశారన్నారు.

ఎర్రబెల్లి దయాకర్ రావు కి, సత్యవతి రాథోడ్ కి మంత్రి పదవులు ఇస్తే ఉద్యమకారులు బాధపడ్డారని, వీరిద్దరూ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నాయకులని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వాదం, ఉద్యమం తెలియని వారికి మంత్రి పదవి ఇస్తే ఎట్లా అని ప్రశ్నించిన ఆయన అధినేత వాస్తవాలు వినే అవకాశం ఇస్తే ఎవరైనా చెబుతారు అని స్పష్టం చేశారు.
అధినేత కెసిఆర్ ఎవరు చెప్పేది వినలేదు అన్న అభిప్రాయాన్ని ఈ వ్యాఖ్యల ద్వారా వ్యక్తం చేశారు. వాస్తవాలు చెప్పే వారు బయట, భజన గాళ్ళు లోపల ఉంటే ఎలా వాస్తవాలు తెలుస్తాయి అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఖమ్మంలో ప్రతిసారి బయట గెలిచిన వారిని పార్టీలోకి తెచ్చుకుంటే నేతలు గ్రూపులుగా విడిపోయారని ఖమ్మంలో ఓటమికి కూడా ఇదే కారణమని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎర్రబెల్లి ని మంచి లీడర్ అంటే ప్రజలు ఉరికించి కొడతారని ఎర్రబెల్లి దయాకర్ రావు టార్గెట్ చేసిన ఆయన ఎర్రబెల్లి చక్కిలిగింతలు పెట్టడం తప్పా ఎవ్వరికీ రూపాయి సహాయం చేయరు అని సంచలన వ్యాఖ్యలు చేశారు . కొన్ని జిల్లాల్లో మా ఎమ్మేల్యేలు ప్రజలకు ఇరిటేషన్ పెంచారని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు పేర్కొన్నారు.
దానిని ఎలా మేనేజ్ చేయాలో పార్టీకి ప్లాన్ లేకపోతే ఎలా గెలుస్తాం అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇక వరంగల్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ అవసరం లేదు. కుక్కలు కూడా వారి వెంట పడవు అని తక్కెళ్లపల్లి రవీందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications