ఓట్లపై ఒక్క ఫిర్యాదు లేదు: తలసాని, 'సానియా-గుత్తా జ్వాలలతో కవిత డ్రామా'
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్, సనత్ నగర్ పరిధిలో ఓట్ల తొలగింపు అని కాంగ్రెస్ పార్టీ నేతలు అవాస్తవాలు మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుద్ధిలేని కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడితే పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే మాట్లాడుతున్నారన్నారు.
ఆయనకు అసలు పిసిసి అధ్యక్ష పదవి ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలో 2014లో కంటే ఇప్పుడు 7వేల ఓట్లు పెరిగిన సంగతిని కాంగ్రెస్ నేతలు గుర్తుకు పెట్టుకోవాలన్నారు. ఓట్ల తొలగింపు పైన ఒక్క ఫిర్యాదు అయినా అందిందా చెప్పాలని సవాల్ చేశారు. ప్రజల్లో నానేందుకు చవకబారు విమర్శలన్నారు.
విహెచ్ అరెస్ట్
మాజీ ప్రధానమంత్రులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల చిత్రాలతో ముద్రించిన పోస్టల్ స్టాంపులను రద్దు చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశం గర్వించదగ్గ నేతలను అవమానించారని అబిడ్స్‌లోని జనరల్ పోస్ట్ ఆఫీస్ భవనం ఎదుట హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ నేతలు బైఠాయించి, ఆందోళన చేపట్టింది.

దీంతో, పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనను విరమించాలని నేతలను అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో ఎంపీ వీహెచ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, కార్తీక్ రెడ్డి తదితరులు ఉన్నారు.
కెసిఆర్ తప్పుకో: పోన్నం
ఒకే దఫాలో రైతుల రుణాలను మాఫీ చేయకపోతే సిఎం చాంబర్ ఎదుట ఆందోళన చేస్తామని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టిఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నామని మరిచి, ప్రతిపక్షంపై ఎదురు దాడి చేస్తున్నారన్నారు. గుత్తా జ్వాలా, సానియా మీర్జాలతో కవిత డ్రామాలు ఆడిస్తున్నారని విమర్శించారు. కెసిఆర్‌కు పాలన చేతకాకుంటే తప్పుకోవాలన్నారు.
కల్తీకల్లుపై అకున్ సబర్వాల్

తెలంగాణ రాష్ట్రంలో కల్తీ కల్లు తాగి వందలాది మంది ఆసుపత్రి పాలవుతున్నారు. దీనిపై తెలంగాణ డ్రగ్ కంట్రోలర్, సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సభర్వాల్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. కల్తీ కల్లు కారణంగా రాష్ట్రంలో ఇప్పటిదాకా 700 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారన్నారు.
కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైతే, కనీసం పన్నెండు వారాల పాటు చికిత్స అవసరమన్నారు. కల్తీ కల్లు విక్రయాలు ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో పెద్ద ఎత్తున సాగుతున్నాయన్నారు. కల్తీ కల్లు విక్రేతలపై పీడీ యాక్టు ప్రయోగిస్తామని హెచ్చరించారు.
కాగా, కల్తీ కల్లు ఒక్కసారిగా ఆపితే నష్టం ఉంటుందని చెబుతున్నారు. కల్తీ కల్లు దొరక్క తెలంగాణలో పలువురు మృత్యువాత పడుతోన్న విషయం తెలిసిందే. కొందరు వింత చేష్టలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు.












Click it and Unblock the Notifications