60 ఏళ్ల తర్వాత.. సరిహద్దులు దాటి వచ్చి గూడు కట్టుకున్న పక్షులు
దేశ అడవుల్లో అరుదైన పక్షుల రక్షణ కోసం జరుగుతున్న ప్రయత్నాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. అంతరించిపోతున్న 'గ్రేట్ ఇండియన్ బస్టర్డ్' పక్షి పిల్లల జననంతో ఇటీవల వార్తల్లో నిలిచిన గుజరాత్ అటవీ శాఖ, తాజాగా మరో అరుదైన విజయాన్ని సొంతం చేసుకుంది. గిర్ అడవుల నుంచి దాదాపు ఆరు దశాబ్దాల క్రితం పూర్తిగా కనుమరుగైపోయిన 'ఇండియన్ గ్రే హార్న్‌బిల్' (బూడిద రంగు కొమ్ము పక్షి) జాతిని తిరిగి అక్కడ విజయవంతంగా ఆవాసం ఏర్పాటు చేసుకునేలా చేశారు.
అడవుల్లో మళ్లీ కిలకిలరావాలు
గతంలో 1950 - 1960 కాలంలో వేటగాళ్ల కారణంగా గిర్ అడవుల్లో ఈ పక్షులు పూర్తిగా అంతరించిపోయాయి. అయితే, 1965లో గిర్ అటవీ ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా మార్చిన తర్వాత అక్కడ అడవులు బాగా పెరిగాయి. దీంతో ఈ పక్షులు మళ్లీ బతకడానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. ఇందులో భాగంగా గుజరాత్ అటవీ శాఖ 2021లో అరావళి అడవుల నుంచి గ్రే హార్న్‌బిల్ పక్షులను తెచ్చి గిర్ ప్రాంతంలో వదిలిపెట్టింది. ప్రభుత్వం రెండు దశల్లో మొత్తం 40 పక్షులను ఇక్కడికి తీసుకువచ్చింది.

శాటిలైట్ నిఘాతో పర్యవేక్షణ
అడవిలో వదిలిన పక్షులు కొత్త వాతావరణానికి అలవాటు పడుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు వాటికి ప్రత్యేక శాటిలైట్ ట్రాన్స్‌మిటర్లను అమర్చారు. దీని ద్వారా వాటి కదలికలను నిరంతరం గమనించారు. మొదట్లో కొత్త ప్రదేశం కావడంతో ఈ పక్షులు 61 చదరపు కిలోమీటర్ల మేర తిరిగాయి. కానీ, రానురాను గిర్ అడవిని తమ సొంత ఇల్లుగా మార్చుకుని కేవలం 5.7 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే స్థిరపడ్డాయి.
సక్సెస్‌ఫుల్ ప్రెగ్నెన్సీ.. కొత్త తరం జననం!
ఈ పునరుద్ధరణ ప్రాజెక్టులో అత్యంత సంతోషకరమైన విషయం ఏమిటంటే.. పక్షులు కేవలం జీవించడమే కాకుండా గిర్ అడవుల్లో విజయవంతంగా గూళ్లు కట్టుకుని గుడ్లు పెట్టాయి. మొదటి సంవత్సరంలోనే ఒక జంట విజయవంతంగా పిల్లలను పెట్టగా, రెండో సంవత్సరంలో మరో మూడు జంటలు గూడు కట్టుకుని సంతానోత్పత్తిని సాగించాయి.
పెద్ద మర్రి, రావి చెట్ల తొర్రల్లో ఇవి గూళ్లు ఏర్పాటు చేసుకుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. పండ్లను తిని అడవి అంతా తిరిగే ఈ పక్షులు గిర్ అడవుల సహజ పునరుత్పత్తికి ఎంతో మేలు చేస్తాయి. అంతరించిపోయిన ఒక పక్షి జాతిని మళ్లీ విజయవంతంగా తీసుకురావడంలో గిర్ ప్రాజెక్ట్ దేశంలోనే అత్యుత్తమ మోడల్‌గా నిలిచిందని అటవీ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications