ధాన్యం కొనే ప్రసక్తే లేదు.! రైతులు ప్రత్యామ్నయ పంటలపై దృష్టి సారించాలన్న మంత్రి నిరంజన్ రెడ్డి.!
హైదరాబాద్: తెలంగాణ రైతాంగం క్లిష్ట పరిస్థితిలను ఎదుర్కొనబోతున్నట్టు తెలుస్తోంది. ఖరీఫ్ పంట కల్లాల్లో నుంచి కదలలేదు కానీ యాసంగి పంట గురించి రైతులకు సందేశాలు పంపిస్తోంది తెలంగణ ప్రభుత్వం. యాసంగిలో వేసే వరి పంటను ఎట్టి పరిస్థితిలో కొనేది ఉండదు కాబట్టి కొనుగోలు కేంద్రాలు కూడా ఉండవని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని, వరి ధాన్యం వేస్తే మాత్రం రైతాంగం కష్టాల్లో చిక్కుకుపోతారని మంత్రి హెచ్చరిస్తున్నారు. ఐతే చాలా వరకు భూములు వరి పంటకే సారవంతం కావడంతో ప్రత్యామ్నాయం సాద్యాసాద్యాల గురించి సమాలోచనలు చుస్తున్నారు తెలంగాణ రైతులు.

యాసంగిలో వరి సాగు చేయవద్దు..
రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతుల సంక్షేమం గురించి తెలంగాణ ప్రభుత్వం ఎంత చిత్తశుద్దితో ఉందనే అంశం చెప్తూనే యాసంగి పంట కొనేది లేదని స్పష్టం చేసారు. రైతుల వ్యతిరేకత తలెత్తకుండా సున్నితంగా వ్యవహారాన్ని చక్కబెట్టాలనుకున్నారు వ్యవసాయ మంత్రి. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీని, కేంద్ర బీజేపి ప్రభుత్వాన్ని రైతుల ముందు దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేసారు. ఒక పక్క తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు విధానాలపై ప్రశంసలు కురిపిస్తూనే మరోపక్క ధాన్యం విషయంలో ప్రభుత్వం వైఖరిని చెప్పే ప్రయత్నం చేసారు.

కేంద్ర మంత్రి పియూష్ గోయల్ పచ్చి అబద్దాలు..
అంతే కాకుండా రైతుల కోసం నిలబడేది టీఆర్ఎస్ మాత్రమేనని, కాంగ్రెస్, బీజేపీలకు రాజకీయ ప్రయోజనాలు తప్ప రైతుల ప్రయోజనాలు పట్టవని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పచ్చి అవాస్తవాలు చెప్పారని, ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రం కేంద్రానికి కేవలం సహకారం మాత్రమే అందిస్తుందని, ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్, ఎగుమతి అంతా ఎఫ్ సీ ఐ బాధ్యత తీసకుంటుదని తెలిపారు. తెలంగాణ నుండి బియ్యం తరలించాలని పలుమార్లు కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ కేంద్రానికి లేఖలు రాసినా స్పందన లేదని అసహనం వ్యక్తం చేసారు.

బీజేపి, కాంగ్రెస్ రాజకీయ ప్రయోజాలు..
ఇదిలా ఉండగా రా రైస్, పార్ బాయిల్డ్ రైస్ కు తేడా తెలియని వాళ్లు బీజేపీ ఎంపీలుగా కొనసాగడం తెలంగాణ ప్రజల దురదృష్టమన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.
పార్ బాయిల్డ్ (ఉప్పుడు బియ్యం) విధానం పెట్టింది కేంద్ర ప్రభుత్వ ఆజమాయిషీలో ఉన్న ఎఫ్ సీ ఐ మాత్రమేనని, చంద్రశేఖర్ రావు ప్రభుత్వం ఈ విధానం ప్రవేశపెట్ట లేదని స్పష్టం చేసారు. ఏడేండ్ల కాలంలో అత్యధిక శాతం కేంద్రం కొనుగోలు చేసింది పార్ బాయిల్డ్ బియ్యమేనని అన్నారు. ఇప్పుడు వంద శాతం బియ్యం సేకరించమనడం దుర్మార్గమని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయాల కోసం ప్రజలను, రైతులను ఏమార్చే విధానం మంచిది కాదని, దేశంలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ రైతుల పక్షాన కొట్లాడకుండా చేతులెత్తేయడం వారి అసమర్ధతకు నిదర్శనమని అన్నారు.

రైతుల ప్రత్యామ్నాయ పంటలు వేయాలు..
వ్యవసాయ చట్టాల మీద రైతులే స్వయంగా పోరాటం చేశారని, తెలంగాణ రైతుల కోసం పార్లమెంటులో, బయటా పోరాడుతున్నది టీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్నడూ తెలంగాణ ప్రయోజనాలు కోసం స్పందించలేదని, కేంద్ర విధానాలు గమనించే పంటల మార్పిడి వైపు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఇచ్చిన పిలుపు మేరకు 10 లక్షల ఎకరాలలో కంది సాగు చేశారని, దీనిని భవిష్యత్ లో 20 లక్షల ఎకరాలకు, పత్తి కోటి ఎకరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు. యాసంగిలో వరి సాగు చేయవద్దని, ఎలాంటి కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదని తేల్చి చెప్పారు మత్రి నిరంజన్ రెడ్డి.












Click it and Unblock the Notifications