ఐటీలో కొత్త ఉద్యోగులకు జీతాలు పెరగడం లేదు! ఇదీ కారణం
హైదరాబాద్/బెంగళూరు: ప్రతి ఏడాది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు కుప్పలు తెప్పలుగా బయటకు వస్తున్నారు. ఐటీ రంగంలో జీతాలు, సౌకర్యాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గ్రాడ్యుయేట్ల సంఖ్య బాగా పెరిగింది. అయితే, ఆశించినట్లుగా వీరందరికీ మంచి ఉద్యోగాలు, ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయా? అంటే కాదనే అంటున్నారు.
హ్యూమన్ రీసోర్స్ అధికారులు వెల్లడించిన డేటా ఇదే స్పష్టం చేస్తోంది. ఐటీ రంగంలోకి కొత్తగా వచ్చిన వారికి వేతన పెంపు ఆశించిన మేర ఉండటం లేదని తెలుస్తోంది.
ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీల పరిస్థితి పైన కూడా ఈ డేటా పెదవి విరుస్తోంది. ఇంజినీరింగ్ చదివిన వారికి సరిగ్గా ఉద్యోగాలు దొరకకపోగా, కొత్తగా ఐటీ స్పేస్‌లోకి ఎంపికయ్యే ఉద్యోగులకు అసలు జీతాలు పెరగడం లేదట.

రూ.పదహారు వేల కోట్ల పరిశ్రమ కలిగిన ఐటీ ఇండస్ట్రీ, ఈ రెండు అంశాల్లో తీవ్ర నిరాశ పరుస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది. టాప్ కంపెనీలుగా ఉన్న టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోతో పాటు చాలా ఐటీ కంపెనీలు కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి వేతనాలు పెంచడంలో అంత శ్రద్ధ చూపడం లేదని, అసలు వేతనాలను సవరించడం లేదని ఈ డేటా చెబుతోందని తెలుస్తోంది.
గత మార్జిన్లు కాపాడుకోవడానికి, పెరుగుతున్న ధరలను, కరెన్సీ మార్పులను సరిచూసుకోవడం పైనే ఈ కంపెనీలు ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయని పేర్కొంటుంది. గత ఏడాది వరకూ కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి మార్జినల్ వేతనాలు పెంచిన అమెరికా కంపెనీలు ఈ ఏడాది కొత్త ఉద్యోగుల వేతనాల్లో ఎలాంటి సవరణలు చేయకూడదని నిర్ణయించిందని తెలుస్తోంది.
అవసరమైన దాని కంటే ఎక్కువ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు వస్తుండటం ఐటీ ఇండస్ట్రీలో ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు అంటున్నారు. కాలేజీల్లో గ్రాడ్యుయేట్లుగా ఉత్తీర్ణత సాధించే ప్రతి ఐదుమంది ఇంజినీర్లకు ఒక్కటే ఉద్యోగం అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. ప్రతి ఏటా భారత్ నుంచి పది లక్షల మంది గ్రాడ్యుయేట్లు వస్తుంటే కేవలం రెండు నుంచి మూడు లక్షల ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయని నాస్కామ్ సర్వే వెల్లడించింది.












Click it and Unblock the Notifications