అక్రమ సంబంధంతో కళ్లలో కారం చల్లి ఎన్నారై హత్య: ఆమె ఎక్కడ?
అఫైర్ కారణంగా బంధువుల చేతిలో దారుణ హత్యకు గురైన ఎన్నారై కేసులో ఇంకా చిక్కుముళ్లు వీడడం లేదు. అతని అఫైర్ నడిపి హత్యలో కీలక పాత్ర పోషించిన మహిళ జాడ తెలియడం లేదు.
హైదరాబాద్: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆగ్రహంతో ఓ ఎన్నారై దారుణ హత్యకు గురయ్యాడు. కళ్లలో కారం చల్లి గొంతు నులిమి అతన్ని హత్య చేశారు. ఈ కేసులో ఇంకా చిక్కు ముళ్లు వీడలేదు. ఎన్నారై సయ్యద్ ఇమ్రాన్ (35) అనే ఎన్నారైని దారుణంగా హత్య చేసి నిర్మాణంలో ఉన్న ఇంటి పడక గదిలో అతని శవాన్ని పూడ్చి పెట్టారు.
ఈ హత్య కేసులో పోలీసులు మరో నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. పోలీసులు ప్రకటించిన నిందితులతోపాటు మరికొందరి ప్రమేయం కూడా ఉందని హతుడి తల్లి ఆరోపించారు. ఈ నెల 4న బార్కస్‌లోని జమాల్‌బండలో సయ్యద్ ఇమ్రాన్ దారుణ హత్యకు గురైన విషయం విదితమే.

హత్యలో సయీద్ బిన్ సాబెత్ బారాబూద్, అతని భార్య ఫాతిమా, సోదరుడు సైఫ్ బిన్ సాబెత్ బారాబూద్ కీలక పాత్ర పోషించడంతోపాటు మృతదేహాన్ని తరలించడంలో సహకరించిన సయీద్ స్నేహితుడు హాషమ్ అలీలు నిందితులని పోలీసులు ప్రకటించారు.
హత్యకు ముందు సయ్యద్ ఇమ్రాన్‌ను సయీద్ బారాబూద్, సైఫ్ బారాబూద్‌లతోపాటు వారి స్నేహితులు కొట్టినట్లు మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇమ్రాన్ చేతికి రూ.10 లక్షలకు పైగా విలువైన వజ్రాలు పొదిగిన చేతి గడియారం ఉందని మృతుని తల్లి అఫ్షా అంటోంది. బంగారు గొలుసు, రూ.40 వేల నగదు, రూ.70 వేల విలువైన ఐఫోన్, ఏటీఎం కార్డు ఉన్నాయని ఆమె చెప్పారు. వాటి వివరాలను పోలీసులు వెల్లడించలేదు.
బారాబూద్ సోదరులు, ఫాతిమాతోపాటు మరికొందరు తన కుమారుడిని కొట్టి చంపారని, వారందరినీ అరెస్టు చేయాలని అఫ్షా డిమాండ్ చేశారు. ఇమ్రాన్‌ను కొట్టిన తరువాత ఏటీఎం పిన్ నంబరును బలవంతంగా చెప్పించుకుని నగదు కాజేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మృతుని బ్యాంకు స్టేట్‌మెంట్ చూస్తే అసలు విషయం బయటపడుతుందని ఓ పోలీసు అధికారి చెప్పారు.
హత్యకు గురైన సయ్యద్ ఇమ్రాన్‌కు చెందిన తెలుపురంగు కైనెటిక్ ద్విచక్ర వాహనం రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీసు స్టేషన్ పరిధిలోని కందుకూరు గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో కనిపించింది. పోలీసుల దృష్టిని మరల్చడానికి వాహనాన్ని అక్కడ పడేసినట్లు తెలుస్తోంది. ఈ ద్విచక్ర వాహనం విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు.
ఇమ్రాన్‌తో వివాహేతర సంబంధం కొనసాగించి, అతని హత్యలో కీలక పాత్ర పోషించిన ఫాతిమా జాడ తెలియడం లేదు. తన భర్త సయీద్ బారాబూద్‌తో ఫాతిమా ఖతర్‌కు పారిపోయిందని మొదట స్థానిక పోలీసులు చెప్పారు.అయితే, సయీద్ బారాబూద్ మాత్రమే పారిపోయినట్లు తెలుస్తోంది. ఫాతిమా ఆమె ఇద్దరు కుమారులు ఎక్కడ ఉన్నారనే విషం కూడా తెలియడం లేదు.












Click it and Unblock the Notifications