మిగిలేది ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి: కారెక్కనున్న ముగ్గురు ఎమ్మెల్యేలు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యుల్లో ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే మిగిలే అవకాశం ఉంది. ముగ్గురు టిడిపి శాసనసభ్యులు ఈ నెల 11వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఆ ముగ్గురు కూడా తెరాసలో చేరితే టిడిపిలో మిగిలే శాసనసభ్యులు ఇద్దరే. వారిలో ఒక్కరు రేవంత్ రెడ్డి కాగా, మరొకరు ఆర్ కృష్ణయ్య. వీరిలో ఆర్. కృష్ణయ్య టిడిపికి దూరంగా ఉంటూ వస్తున్నారు. దాంతో రేవంత్ రెడ్డి ఒక్కరు మాత్రమే టిడిపికి దిక్కుగా మారనున్నారు.
మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీలు బుధవారమే తెరాసలో చేరాలనుకున్నారు. అయితే అమావాస్య కారణంగా ఈ నెల 11కు వాయిదా వేసుకున్నట్లు తెరాస వర్గాలు తెలిపాయి. వీరిద్దరితో పాటు ఆ రోజుకు మరో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా వస్తారని వారు చెప్పారు. వీరి ముగ్గురి చేరిక ఖరారైందని, ముహూర్తమే ఆలస్యమని తెలిసింది.

ఈ నెల 10న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వీటిలో టిడిపి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు మంగళవారం ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ఆధ్వర్యంలో ముఖ్యనేతలంతా సమావేశమయ్యారు. ఐదుగురు ఎమ్మెల్యేలకు గాను రేవంత్‌రెడ్డి ఒక్కరే దీనికి హాజరయ్యారు. నగరంలోనే ఉన్న గోపీనాథ్, గాంధీ, కృష్ణయ్యతో పాటు సండ్ర కూడా గైర్హాజరయ్యారు.
తనకు నిరుద్యోగులతో సమావేశం ఉన్నందున రాలేకపోతున్నట్లు కృష్ణయ్య సమాచారం ఇచ్చారని టిడిపి వర్గాలు తెలిపాయి. గాంధీ, గోపీనాథ్‌లు తెరాసలో చేరే ప్రయత్నాల్లో ఉన్నందున డుమ్మా కొట్టారు. ఇక ఖమ్మం మున్సిపల్ ఎన్నికల కార్యక్రమాలున్నందున రాలేకపోతున్నట్లు సండ్ర చెప్పారని పార్టీనేతలు తెలిపారు.
అయితే అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాత్మక సమావేశానికి ఐదుగురిలో నలుగురు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆర్.కృష్ణయ్య పార్టీని వీడుతారనే ప్రచారం పెద్దగా లేకున్నా ఆయన టిడిపి కార్యక్రమాల్లోనూ అంతగా పాల్గొనడం లేదు. కృష్ణయ్య, రేవంత్‌రెడ్డిలే అసెంబ్లీలో తెదేపా తరపున పాల్గొంటారా లేక సండ్ర వెంకటవీరయ్య కూడా వీరితోనే ఉంటారా అన్నది ఈ నెల 11 నాటికి స్పష్టత వస్తుంది.












Click it and Unblock the Notifications