అప్పుడే పని: కెసిఆర్‌కి పొన్నాల చురక, కిషన్ హెచ్చరిక
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏడాది రుణమాఫీ పైన విపక్షాలు మండిపడుతున్నాయి. తెలంగాణ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం మాట్లాడుతూ... తమకు అప్పుడే పని కల్పిస్తారనుకోలేదని తెరాస ప్రభుత్వానికి ఎద్దేవా చేశారు. కెసిఆర్ ప్రభుత్వ తీరుపై మూడు నెలలు అయినా వేచి చూద్దామనుకున్నామని, రెండుర్జోలుల్లోనే ఆగ్రహావేశాలు వచ్చాయన్నారు. సర్కారు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.
రైతుల ఆగ్రహాన్ని, దుఖాన్ని సమాజానికి చాటి చెప్పిన రాజకీయ పార్టీలు, పత్రికలను ఆంధ్రా పార్టీలు, ఆంధ్రా పత్రికలంటూ తప్పించుకునే ప్రయత్నం చేయడం తగదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది గంటలకే తెరాస జెండా దిమ్మెలను కూల్చేయడం, కెసిఆర్ దిష్టిబొమ్మను తగులబెట్టడం వంటి చర్యలకు రైతులు ఎందుకు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చాక ఇంతకుముందులా మాట్లాడితే ప్రజలు ఊరుకోరన్నారు.

వెనక్కి తగ్గితే ఊరుకోం: కిషన్ రెడ్డి
రైతు రుణాల మాఫీపై తెరాస ప్రభుత్వం వెనుకడుగు వేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి హెచ్చరించారు. లక్ష రూపాయల్లోపు అన్ని రకాల వ్యవహాయ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. హామీలిచ్చే ముందు సాధ్యాసాధ్యాలను పరిశీలించుకోవాలన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని తెరాస కార్యకర్తలే తమకు ఫోన్లు చేస్తున్నారన్నారు.
రుణమాఫీపై జగన్ పార్టీ
ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా రైతులందరికీ లక్ష రూపాయల వరకూ రుణమాఫీని అమలు చేయాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావును తెలంగాణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభాపక్షం కోరింది. అప్పుడు హామీలిచ్చి, ప్రభుత్వంలోకి వచ్చాక షరతులు విధించడం రైతాంగాన్ని నిట్టనిలువునా ముంచడమేనని ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ తాటి వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సాయం వెంకటేశ్వర్లు, విప్ బానోతు మదన్‌లాల్ నాయక్ ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
రుణాలన్నీ రద్దు: న్యూడెమోక్రసీ
రైతులు ఏ సంవత్సరంలో తీసుకున్న రుణమైనా సరే రద్దు చేయాల్సిందేనని న్యూడెమోక్రసీ నేత సూర్యం డిమాండ్ చేశారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాటలు అనుమానాస్పదంగా ఉన్నాయని, 2013-14 ఆర్థిక సంవత్సరానికే మాఫీని పరిమితం చేయడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications