తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్.. ఏర్పాట్లు పూర్తి.. ఎక్కడెక్కడ అంటే..
కరోనా వైరస్.. కరోనా స్ట్రెయిన్ నేపథ్యంలో ఆందోళన నెలకొంది. వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. ఇటీవల ఏపీలో గల కృష్ణా జిల్లాలో వ్యాక్సిన్ కోసం డ్రై రన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. శనివారం జనవరి 2వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్నీ ఏర్పాట్లను పూర్తిచేశారు.
తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆరుచోట్ల డ్రై రన్ నిర్వహిస్తారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి, యశోదా ఆస్పత్రి, తిలక్‌నగర్‌లో గల పీహెచ్‌సీ కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహిస్తారు. టీకా పంపిణీలో ఎదురయ్యే సవాళ్లు, ప్రణాళికను అమలు చేయడంలో సాధ్యాసాధ్యాలు, వ్యాక్సిన్ రవాణా విషయంలో అవాంతరాలను గుర్తించడంతోపాటు.. క్షేత్ర స్థాయిలో వ్యాక్సినేషన్ సిబ్బందిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి డ్రై రన్‌ను నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు.

గత నెల 28, 29 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, అసోం, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో తొలిదశ డ్రై రన్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఏపీలో కృష్ణా జిల్లాలో డ్రై రన్ నిర్వహించగా.. మంచి స్పందనే వచ్చింది. కరోనా స్ట్రెయిన్ కలవరానికి గురిచేస్తోంది. మన దేశంలో స్ట్రెయిన్ కేసుల సంఖ్య 29కి చేరింది. ఇవాళే నాలుగు కేసులు వచ్చాయి. అందులో తెలంగాణ నుంచి ఒకటి కావడం ఆందోళన కలిగిస్తోంది.