పల్లాకే జనగామ..లైన్ క్లియర్; సయోధ్య కుదిర్చిన మంత్రి కేటీఆర్!!
తెలంగాణ రాష్ట్రంలో జనగామ టికెట్ గురించి జరిగిన రగడ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి టికెట్ కేటాయించకుండా జనగామ సీటును పెండింగ్ లిస్ట్ లో పెట్టిన విషయం తెలిసిందే. అయితే జనగామ నియోజకవర్గం నుండి పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేస్తారని, పల్లా రాజేశ్వర్ రెడ్డి కోసమే జనగామలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి టికెట్ ఇవ్వలేదని స్థానికంగా ను పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
దీంతో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పల్లా రాజేశ్వర్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాహాటంగానే ఆయనను టార్గెట్ చేశారు. తాను కూడా కచ్చితంగా ఎన్నికల బరిలో ఉంటానని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పష్టం చేశారు. అయితే తాజాగా వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న వివాదానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చెక్ పెట్టారు.

పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ల మధ్య మంత్రి కేటీఆర్ సయోధ్య కుదిర్చారు. ఈరోజు మినిస్టర్స్ క్వార్టర్స్ లో జనగామ ప్రజాప్రతినిధులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మరో ఇద్దరు ఆశావహులు మండల శ్రీరాములు, కిరణ్ కుమార్ గౌడ్ లతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. జనగామ బీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ని గెలిపించుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
జనగామ బీఆర్ఎస్ అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తారా.. అని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో మంత్రి కేటీఆర్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పి జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డి కి లైన్ క్లియర్ చేశారు. జనగామ ఎమ్మెల్యే అయిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి తెలంగాణ ఆర్టీసీ సంస్థ చైర్మన్ బాధ్యతలు అప్పగించి ఆయన స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి అవకాశం కల్పించాలని భావించారు.
ఆర్టీసీ సంస్థ చైర్మన్ గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి పదవి కట్టబెట్టినప్పటికి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా బరిలో తానే ఉంటానని పేర్కొన్నారు. దీంతో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వారిద్దరిని పిలిచి సయోధ్య కుదిర్చిన మంత్రి కేటీఆర్ జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ని గెలిపించాలి అంటూ దిశా నిర్దేశం చేశారు. ఇక మంత్రి కేటీఆర్ తాజా ప్రకటనతో జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అని స్పష్టంగా తెలుస్తుంది.












Click it and Unblock the Notifications