palla rajeshwar reddy trs mlc hyderabad పల్లా రాజేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ హైదరాబాద్ politics
'ఎమ్మెల్సీ'గా పల్లాదే గెలుపు... విజయం దాదాపుగా ఖరారు... ఓటమిపై తీన్మార్ మల్లన్న రియాక్షన్...
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం దాదాపుగా ఖరారైంది. రెండో ప్రాధాన్యత ఓటుతో ఆయన గెలుపు ఇక లాంఛనమే.
అయితే అధికారిక ప్రకటన మాత్రం అర్ధరాత్రి తర్వాతే వచ్చే అవకాశం ఉంది. చివరగా ఎలిమినేట్ అయిన స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్ కుమార్) ఓట్లను ప్రస్తుతం పల్లాకు బదిలీ చేస్తున్నారు. మొత్తంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 10వేల ఓట్ల పైచిలుకు తేడాతో గెలుపొందినట్లు తెలుస్తోంది.
అంతకుముందున్న సమాచారం ప్రకారం... పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1,32,683 ఓట్లు రాగా తీన్మార్ మల్లన్నకు 1,08,104 ఓట్లు వచ్చాయి. మొత్తానికి గత నాలుగు రోజులుగా ఉత్కంఠభరితంగా సాగిన కౌంటింగ్‌లో చివరకు విజయం పల్లా రాజేశ్వర్ రెడ్డినే వరించింది. ఈ నెల 17వ తేదీన కౌంటింగ్ ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటివరకూ ప్రతీ దశలోనూ పల్లా రాజేశ్వర్ రెడ్డే ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చారు. రెండో ప్రాధాన్యత ఓటులో ఫలితాలు తారుమారవుతాయని భావించినప్పటికీ అలాంటిదేమీ జరగలేదు.

ఇక ఓటమిని అంగీకరిస్తూ తీన్మార్ మల్లన్న ఇప్పటికే మీడియా ముందుకు వచ్చారు. జాతీయ,ప్రాంతీయ పార్టీలను పక్కనపెట్టి తీన్మార్ మల్లన్న అనే సామాన్యుడిని ఈ ఎన్నికలో పట్టభద్రులు ఆదరించారని అన్నారు. ఓటింగ్‌లో పాల్గొన్న పట్టభద్రులందరికీ ధన్యవాదాలు తెలిపారు.ఏదేమైనప్పటికీ ఈ ఎన్నికల్లో ప్రజలు 100శాతం గెలిచారని అన్నారు. కేవలం మూడంటే మూడు శాతం ఓట్లతోని పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారని అన్నారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వంద కోట్లు... దొంగ ఓట్లతో సామాన్యుడిని చట్టసభలో అడుగుపెట్టకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఎన్నికల్లో అక్రమాలను తన ఓటమికి సాకుగా చూపించదలుచుకోలేదని అన్నారు. భవిష్యత్తులో కచ్చితంగా చట్టసభలో అడుగుపెట్టి తీరుతానని అన్నారు.
ఇక అటు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి రెండో ప్రాధాన్యత ఓట్లతో ఘన విజయం సాధించారు. కౌంటింగ్ ప్రక్రియ మొదలైన ఈ నెల 17 నుంచి ఇప్పటివరకూ సురభి వాణిదేవే ఆధిక్యం ప్రదర్శిస్తూ వచ్చారు. చివరకు తన సమీప బీజేపీ అభ్యర్థి రామచందర్ రావుపై 11,703ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో బీజేపీ తమ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. టీఆర్ఎస్ అభ్యర్థిని వాణీదేవికి 1,49,269 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రామచందర్ రావుకి 1,37,566 ఓట్లు వచ్చాయి.