పరకాల పాలిటిక్స్: బరిలో బిజినెస్ మెన్; ఫైట్ పీక్స్!!
పరకాల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. పరకాల నియోజకవర్గంలో బిజినెస్ మాన్ ల మధ్య కొనసాగుతున్న పోటీ ఆసక్తికరంగా మారింది. అర్థబలం దండిగా ఉన్న బిజినెస్ మెన్ ఎన్నికల బరిలోకి దిగడంతో పరకాలలో ఎన్నికల ఖర్చు పైన కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది.
పరకాల నియోజకవర్గంలో మళ్లీ గులాబీ జెండా ఎగురవేయాలని బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. గత రెండు దఫాలుగా పరకాల నియోజకవర్గ ప్రజలు చల్లా ధర్మారెడ్డి ని గెలిపించారు. ఇప్పుడు మళ్లీ మూడోసారి చల్లా ధర్మారెడ్డి పరకాల బరిలో దిగారు. ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేయాలని సంకల్పంతో ఉన్నారు.

ఇక అనూహ్యంగా పరకాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన రేవూరి ప్రకాశ్ రెడ్డి, తనకు ఉన్న గుడ్ ఇమేజ్ తో పరకాల ప్రజల మద్దతు కూడగట్టుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నారు. అంతకు ముందు రేవూరి ప్రకాష్ రెడ్డి నర్సంపేట నుండి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని అందరూ భావించారు.
అయితే ఎన్నికల సమయంలోనే అనూహ్యంగా ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని పరకాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. చల్లా ధర్మారెడ్డిని ఓడించి పరకాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇక బిజెపి నుండి హనుమకొండలో ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్వహిస్తున్న, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బాధ్యుడు డాక్టర్ కాళీ ప్రసాద్ రంగంలోకి దిగారు.
ఈయన కూడా పైసలు దండిగానే ఉన్న నేత కావడంతో పరకాల నియోజకవర్గంలో అర్ధ బల ప్రదర్శన జరగనుంది అని చర్చ జరుగుతుంది. ఎన్నికల బరిలో ఉన్న ముగ్గురు నేతలు హేమాహేమీలు కావడంతో ఈసారి పరకాలలో ఏం జరగబోతుంది అన్నది ఆసక్తిగా మారింది. దీంతో పరకాలలో త్రిముఖ పోటీ కొనసాగుతోంది. ప్రస్తుతం ఎవరికి వారు పరకాలలో పెద్దఎత్తున ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications