ఆ విషయంలో తెలంగాణ సర్కార్ భేష్... శశి థరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశంసలు...
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ ఐటీ స్టాండింగ్ కమిటీ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించింది. రాష్ట్రంలో ఐటీ రంగం పురోగతి, ప్రభుత్వ సేవల్లో టెక్నాలజీ వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పద్దతులను కమిటీ అభినందించింది. ముఖ్యంగా డిజిటల్ గవర్నెన్స్ సేవలు, ఇన్నోవేషన్ రంగంలో ఇంకుబేటర్ల ఏర్పాటు, టీ ఫైబర్ ప్రాజెక్టులపై ప్రశంసలు కురిపించింది. దేశంలో ఎక్కడ ఆదర్శవంతమైన కార్యక్రమాలు అమలైనా.. వాటి నుంచి నేర్చుకుని... ఆ విధానాలను ప్రజా సంక్షేమానికి ఉపయోగించాలన్నదే తమ ఉద్దేశమని కమిటీ పేర్కొంది.గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో పర్యటిస్తున్న కమిటీ ఇక్కడ మౌలిక వసతులతో పాటు పలు అంశాలపై అధ్యయనం జరుపుతోంది.
బుధవారం(సెప్టెంబర్ 9) పార్లమెంటరీ ఐటీ స్టాండింగ్ కమిటీతో భేటీ అయిన మంత్రి కేటీఆర్... ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రాజెక్టులు, విజన్‌ని వారికి వివరించారు. ఇన్నోవేషన్ రంగంలో ఏర్పాటు చేసిన ఇంక్యుబేటర్ వివరాలు అందజేశారు. టీ హబ్, వి హబ్, అగ్రి హబ్, బీ హబ్, రిచ్, టీ వర్క్ వంటి కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్, ఇతర విధానపరమైన నిర్ణయాలు, ఐటీ పరిశ్రమతో కలిసి ప్రభుత్వం పనిచేయడంతో రాష్ట్రానికి పెట్టబడులు వచ్చాయని చెప్పారు. ప్రపంచంలోనే నాలుగు అతి పెద్ద టెక్ కంపెనీల అతిపెద్ద క్యాంపస్‌లు అమెరికా వెలుపల హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు. ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పనతో పాటు ఐటీ ఎగుమతులను సైతం భారీగా పెంచగలిగామన్నారు.

సీఎం కేసీఆర్ విజన్ మేరకు ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ కోసం వినియోగిస్తున్న టెక్నాలజీ, దాని పనితీరుపై వివరాలు కమిటీకి అందించారు. తెలంగాణ లాంటి రాష్ట్రాలకు ప్రత్యేకంగా సహాయం అందించడంలో కేంద్రం ప్రభుత్వం మరింత చొరవ చూపించేలా ఇక్కడి విధానాలపైన ప్రత్యేక సిఫార్సు చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ కమిటీని కోరారు. తెలంగాణ లాంటి నూతన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఐటి శాఖ మరింత సహాయం అందించాల్సిన అవసరం ఉందని ముఖ్యంగా ఐటీఐఆర్ వంటి సమాంతర ప్రాజెక్టును, అదనపు ప్రోత్సాహాన్ని వెంటనే ప్రకటించే అంశంలో ఈ కమిటీ సహకరించాలని కోరారు.
Recommended Video
ఈ సందర్భంగా... డిజిటల్ ఎకానమీ, గవర్నెన్స్‌లో ఐటీ టెక్నాలజీ వినియోగంపై పార్లమెంటరీ కమిటీ కేటీఆర్ నుంచి వివరాలు తెలుసుకుంది. రాష్ట్రంలో ఉన్న మీసేవా కార్యకలాపాల్లో తీసుకువచ్చిన మార్పులు... ముఖ్యంగా మొబైల్ ఆధారిత ప్రభుత్వ సేవలు, కాంటాక్ట్ లెస్ గవర్నెన్స్ దిశగా చేపడుతున్న కార్యక్రమాలు.. టీ వాలెట్ సాధించిన మైలురాళ్లను కేటీఆర్ కమిటీకి వివరించారు.రానున్న కాలంలో ఇలాగే వినూత్న కార్యక్రమాలు కొనసాగితే హైదరాబాద్ అద్భుతమైన అభివృద్ధి సాధిస్తుందని కమిటీ అభిప్రాయపడింది. ఇప్పటికే ఆదర్శవంతమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్న తెలంగాణ పద్ధతులను, దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమలు చేసే అంశంపైన తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని చెప్పింది.












Click it and Unblock the Notifications