ప్రధాని, అమిత్ షాతో పవన్ కల్యాణ్ - డిసైడింగ్ టైం..!!
తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ కేంద్రంగా ఆసక్తికర రాజకీయం సాగుతోంది. ఏపీలో టీడీపీతో పొత్తు ప్రకటించిన పవన్..తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నారు. ఏపీలో తమ రెండు పార్టీలతో బీజేపీని కలుపుకు వెళ్లాలనేది పవన్ వ్యూహం. దీంతో, ఇప్పుడు తెలంగాణలో బీజేపీ మేలు జరిగే పవన్ తన సమర్ధత నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ సమయంలోనే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా తో పవన్ సమావేశం కానున్నారు.
బీజేపీకి ప్రతిష్ఠాత్మకం : తెలంగాణలో ఇప్పుడు సత్తా చాటుకోవటం బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణ పైన ప్రధాని ప్రకటనతో తెలంగాణ ఎన్నికల్లో అనుకూలంగా మారుతుందని బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఇక, జనసేనతో పొత్తు ద్వారా కలిసి వస్తుందని అంచనా వేస్తోంది. ఏపీలో జగన్ ను ఓడించటం లక్ష్యంగా నిర్ణయించుకున్న పవన్ ఆ వ్యూహంలో భాగంగా తెలంగాణలో బీజేపీతో పొత్తు ఖరారు చేసుకున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. తెలుగుదేశం మద్దతు ఓటర్లు ఇప్పుడు జనసేనకు వేస్తారా, లేక ప్రచారం సాగుతున్నట్లుగా కాంగ్రెస్ కు అండగా నిలుస్తారనేది ఈ ఎన్నికల్లో కీలకంగా మారుతోంది.

ప్రధాని రోడ్ షో లో పవన్ : తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి బీజేపీ ముఖ్య నేతలు తరలి వస్తున్నారు. ప్రధాని మోదీ ఈ నెల 24,25,27 తేదీల్లో తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అమిత్ షా ఈ నెల 18తో సహా మూడు విడతలుగా ప్రచారం నిర్వహించనున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో ప్రచారం కోసం అయిదు రోజులు కేటాయించారు. ప్రధాని మోదీ, అమిత్ షా హైదరాబాద్ నగరంలో నిర్వహించే రోడ్ షో లో పవన్ కల్యాణ్ పాల్గొంటారు. ఈ మేరకు బీజేపీ నేతలతో చర్చల తరువాత నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లోని కుకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన గెలుపు ఇప్పుడు పార్టీకి కీలకంగా మారుతోంది. అక్కడే కాంగ్రెస్, బీఆర్ఎస్ సైతం తమ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడ ఏపీ మూలాలు ఉన్న ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఇక్కడ ఫలితంపైన ఉత్కంఠ కొనసాగుతోంది.

ఏపీ పొత్తులపై ప్రభావం : ఇక, హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలోనూ ప్రధానితో పాటుగా పవన్ హాజరయ్యారు. హైదరాబాద్ లో జరిగే ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో ప్రధాని మోదీ, అమిత్ షా తో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందుగా తెలంగాణలో ఎన్నికల ప్రచారం..గెలుపు వ్యూహాల పైన చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీలో బీజేపీ రాజకీయ భవిష్యత్ నిర్ణయాల పైన ప్రభావం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్ లో ఏపీ మూలాలు చెందిన ఓటర్ల మద్దతు కూడగట్టటంలో పవన్ పైన బీజేపీ పెట్టుకున్న ఆశలు ఫలిస్తాయా లేదా అనేది ఆసక్తి కరమే. దీంతో, తెలంగాణ ఎన్నికల తరువా ఏపీలో పొత్తులు..ఉమ్మడి వ్యూహాల పైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications