తెలంగాణా ఎన్నికలు: నాపై ఒత్తిడి ఉంది: పవన్ కళ్యాణ్; అయినా తగ్గొద్దు: జనసైనికులు!!
తెలంగాణ రాష్ట్రంలో వచ్చేఎన్నికలకు జనసేన పార్టీ రెడీ అయ్యింది. తెలంగాణా ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఎన్నికల బరిలోకి దిగడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. వచ్చే ఎన్నికలలో 32 స్థానాలలో పోటీ చేయడానికి జనసేన సిద్ధమైంది.
ఈ సమయంలో తనపై చాలా ఒత్తిడి ఉందని పవన్ కళ్యాణ్ తెలంగాణ పార్టీ శ్రేణులతో భేటీ నిర్వహించి వారి అభిప్రాయాలను వ్యక్తం చేయాలని కోరారు. దీంతో తెలంగాణ శాసనసభ ఎన్నికలలో జనసేన పోటీ చేయవలసినదేనని తెలంగాణ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని జనసేన తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయంలో జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలపై పవన్ కళ్యాణ్ పోటీ చేయదలుచుకున్న అభ్యర్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అయితే ఈ సందర్భంగా అందరూ అభ్యర్థులు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని, వెనక్కు తగ్గొద్దు అని పవన్ కళ్యాణ్ కు సూచించారు. ఎన్నాళ్ళ నుండో ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నామని, ఈ దఫా పోటీ చెయ్యకపోతే తెలంగాణలో పార్టీ ఎదుగుదలను చేతులారా ఆపుకున్నట్టే అని అభిప్రాయపడ్డారు.
2018లో కొత్త రాష్ట్రంలో రాజకీయ గందరగోళానికి తావివ్వకూడదనే ఉద్దేశంతో పోటీ చేయరాదన్న అధ్యక్షుడి నిర్ణయాన్ని గౌరవించి పోటీకి పట్టు పట్టలేదని, కానీ మిత్రపక్షమైన బీజేపీ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ నుండి విరమించుకున్నామని, ఈ సారి తప్పనిసరిగా పోటీ చెయ్యాల్సిందేనని ముక్త కంఠంతో కోరారు. ఇప్పుడు పోటీ చెయ్యకుంటే ప్రజల ముందుకు భవిష్యత్ లో బలంగా వెళ్ళటం కష్టమేనని, క్యాడర్ నిరుత్సాహానికి గురవుతారని స్పష్టం చేశారు.
పరిస్థితులు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉన్న కారణంగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. దీంతో నేతల అభిప్రాయాలను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయిలో పరిస్థితులను తానూ అర్ధం చేసుకోగలనని,అయితే తన మీద ఉన్న ఒత్తిడి వాస్తవమేనని, అయితే నాయకులు, జన సైనికులు, వీర మహిళల అభిప్రాయాలను గౌరవిస్తానని పేర్కొన్నారు. సరైన నిర్ణయం తీసుకోవటానికి రెండు రోజుల సమయం అవసరం అని తెలిపారు.












Click it and Unblock the Notifications