తెలంగాణలో 7 నుంచి 14 ఎంపీ స్థానాల్లో పోటీ
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో 7 నుంచి 14 ఎంపీ స్థానాల్లో పోటీచేసేందుకు జనసేన సిద్ధంగా ఉందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇక్కడ కూడా ఎవరైనా తమతో పొత్తులు పెట్టుకోవడానికి ముందుకు వస్తే సంతోషమేనని, ఆహ్వానిస్తామన్నారు. జగిత్యాలలో జనసేన రాష్ట్ర కార్యనిర్వాహకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తాను ఒక ఆశయం కోసం పోరాడుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చే స్థితిలో తాను లేనని, వారు చేసిన పోరాటాల నుంచే తాను స్ఫూర్తి పొందానన్నారు.
తెలంగాణలోని ఎంపీ స్థానాల్లో పోటీచేయాలని జనసేనాని నిర్ణయించుకోవడం వెనక బలమైన కారణముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ రాష్ట్రానికి ముందుగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, ఆ ఎన్నికల్లో పోటీచేస్తారా? లేదా? అనే స్పష్టత ఇవ్వకుండా ఎంపీ ఎన్నికలకు మాత్రమే పవన్ ప్రకటించారంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయకుండా లోక్ సభ ఎన్నికల్లో పోటీచేస్తే కచ్చితంగా ఓట్ల చీలిక ఉంటుందని అంచనా వేస్తున్నారు.

భారత రాష్ట్ర సమితికి లాభిస్తుందా? లేదంటే బీజేపీకి లాభిస్తుందా? అనేది కచ్చితంగా ఇప్పుడే చెప్పలేమంటున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏపీలో వ్యతిరేక ఓటు చీలిపోనివ్వకుండా పోటీచేస్తున్న పవన్ కల్యాణ్ తెలంగాణలో ఒంటరిగాకానీ, ఎవరితోనైనా పొత్తు పెట్టుకొని కానీ పోటీచేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి కేసీఆర్ కు లాభిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతారా? లేదా? అనేది కూడా ప్రధానమైన విషయమని, అప్పటి నిర్ణయాన్ని బట్టి ఎంపీ ఎన్నికల ఫలితాలను అంచనా వేయవచ్చంటున్నారు.