చిరుతో సంబంధంలేదు, నన్ను వాడుకోలేరు, కలిస్తే తప్పేంటి: కేసీఆర్‌పై పవన్ ప్రశంసల వర్షం
కరీంనగర్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరీంనగర్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. చిరంజీవితో తన సంబంధాలపై, అభిమానుల గురించి ఆయన మాట్లాడారు. అదే సమయంలో సీఎం కేసీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గురించి మాట్లాడుతూ.. ఆయన తన పార్టీని బీజేపీలో విలీనం చేయమని అడిగారని, తాను మాత్రం ససేమీరా అన్నానని చెప్పారు. తనకు బలం ఉన్నచోటే పోటీ చేస్తానని పవన్ తేల్చి చెప్పారు. తన స్థాయి, బలాన్ని దృష్టిలో పెట్టుకొని పోటీ చేస్తానని చెప్పారు.

చిరంజీవితో సహా కుటుంబ సభ్యుల సలహా తీసుకోను
తన రాజకీయాలకు తన సోదరుడు, కాంగ్రెస్ నేత చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. పార్టీ కోసం తాను చిరంజీవి సలహా తీసుకోలేదని, తాను ఇదివరకు కుటుంబ సభ్యుల సలహా తీసుకోలేదని, ఇక ముందు తీసుకోనని చెప్పారు. తాను తన అభిమానులను ఓ ప్రాంతానికి పరిమితం చేయాలని అనుకోవడం లేదని చెప్పారు. తనకు రెండు ప్రాంతాల్లో అభిమానులు ఉన్నారని చెప్పారు. తాను సామాజిక తెలంగాణ కోరుకుంటున్నానని, అందుకు అందరితో కలిసి పని చేస్తానని చెప్పారు.

కేసీఆర్‌పై ప్రశంసల వర్షం
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎంతో కష్టపడి పని చేస్తున్నారని చెప్పారు. రాజకీయ పార్టీలను ఏకీకరణ చేసిన ఘనత ఆయనదే అన్నారు. తెలంగాణను తెచ్చింది కేసీఆరే అని ప్రజలు కూడా నమ్మారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ కీలక పాత్ర పోషించారని ప్రశంల వర్షం కురిపించారు. ఉద్యమం సమయంలో రాజకీయ పార్టీలన్నింటిని ఏకీకరణ చేశారని కితాబిచ్చారు.

నన్ను ఎవరూ వాడుకోలేరు
తనను ఎవరూ వాడుకోలేరని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ తనను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలను ఆయన కొట్టి పారేశారు. తనకు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చాల్సిన అవసరం లేదని చెప్పారు.

నా అంతిమ లక్ష్యం అదే
రాజకీయాలను అస్థిరపరిచే ఉద్దేశ్యం తనకు ఏమాత్రం లేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను రాజకీయంగా ఓ పార్టీకి లేదా ప్రభుత్వానికి లేదా విపక్షానికి లబ్ధి చేకూర్చే పనులు చేయనని తేల్చి చెప్పారు. ప్రజలకు లబ్ధి చేకూర్చడమే తన అంతిమ లక్ష్యమని చెప్పారు. సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు.

కేసీఆర్‌ను కలిస్తే తప్పేంటి, ఇరు రాష్ట్రాల సమస్యలపై
తాను తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిస్తే తప్పేమిటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబితే తప్పు పడితే ఎలా అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న గొడవలపై ఎలా వ్యవహరిస్తారనే అంశంపై కూడా పవన్ స్పందించారు. ఈ అంశాలపై తాను సున్నితంగా వ్యవహరిస్తానని చెప్పారు. రాజకీయ అస్థిరత కోసం తాను మాట్లాడనని చెప్పారు.

విమర్శలనే పనిగా పెట్టుకోను
తెలుగుదేశం, టీఆర్ఎస్ పార్టీల నిర్మాణానికి దశాబ్దాలు పట్టిందని, జనసేనకు కూడా సమయే పడుతుందని పవన్ చెప్పారు. ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు ఎన్ని స్థానాల్లో పోటీ చేసే విషయమై ప్రకటిస్తానని చెప్పారు. అధికార పార్టీలపై విమర్శలనే పనిగా తాము పెట్టుకోబోమని చెప్పారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేల చేరిక పైన కూడా స్పందించారు.












Click it and Unblock the Notifications