ఇది క్లియర్, జగన్-చంద్రబాబులా: హైదరాబాద్‌ను వీడి ఏలూరుకు పవన్!
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు తరలి వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది! నివాసం హైదరాబాదులో ఉన్నప్పటికీ ఓటు హక్కును ఏలూరులో నమోదు చేయించుకోవాలని నిర్ణయించారు.
సోమవారం నాడు పగో జిల్లాకు చెందిన పలువురు అభిమానులు, పార్టీ కార్యకర్తలు హైదరాబాదులో పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు ఓటు హక్కును ఏపీకి తరలించాలని కోరినట్లుగా తెలుస్తోంది. దీనికి పవన్ ఓకే చెప్పారు. అంతేకాకుండా ఏలూరులో తనకు ఇల్లు కూడా చూడాలని చెప్పారని తెలుస్తోంది. కాగా, పవన్‌కు ఇప్పటిదాకా జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కు ఉంది.

తెలంగాణ నుంచి ఏపీకి షిఫ్ట్!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ నుంచి ఏపీకి షిఫ్ట్ అవుతున్నారు! గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ, ఏపీలలో టిడిపి - బిజెపి తరఫున ప్రచారం చేశారు. విభజన నేపథ్యంలో ఇప్పుడు ఆయన ప్రధానంగా ఏపీకే పరిమితం కానున్నారని అర్థమవుతోంది.
పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఏపీలోని సమస్యల పైనే స్పందిస్తున్నారు. కాపులకు రిజర్వేషన్, రాజధాని భూములు, ఏలూరులో పరిశ్రమలు, విమానాశ్రయ భూములు.. ఇలా ఏపీ సమస్యల పైనే స్పందిస్తున్నారు.
అదేవిధంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ జనసేన పోటీ చేయలేదు.
తెలంగాణలోని సమస్యల పైన స్పందించకపోవడం, అలాగే జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, 2019 ఎన్నికల్లో ఏపీ నుంచే ఆయన పోటీ చేసేందుకు తయారయ్యేందుకు హైదరాబాద్ నుంచి ఏలూరుకు ఓటు హక్కును మార్చుకోవాలనే నిర్ణయం చూస్తుంటే.. పవన్ ప్రధానంగా ఏపీ పైనే దృష్టి సారిస్తున్నారని, ఇంకా చెప్పాలంటే చంద్రబాబు, జగన్‌ల వలె ఏపీకే పరిమితం కాబోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
2014 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఓటు కూడా హైదరాబాదులోనే ఉంది. ఆ తర్వాత ఏపీకి మార్చుకున్నారు. పార్టీ పరంగా చంద్రబాబు, లోకేష్‌లు పూర్తిగా ఏపీ పైనే దృష్టి సారించారు. వైసిపి అధినేత జగన్‌కు తన సొంతూళ్లోనే ఓటు హక్కు ఉన్నప్పటికీ.. తెలంగాణలో తన పార్టీని వదిలేశారని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications