Pawan kalyan: ఆంధ్ర జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మనిచ్చింది; మాటిస్తున్నా.. ఇకపై తెలంగాణాలోనూ తిరుగుతా!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు హనుమకొండలోని హంటర్ రోడ్ లో బిజెపి విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్, హన్మకొండ జిల్లాల బిజెపి అభ్యర్థుల కోసం ప్రచార పర్వాన్ని సాగించిన పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . తెలంగాణ రాష్ట్రం తనకు ఎంతో బలాన్ని ఇచ్చిందని అదే స్ఫూర్తితో ఏపీలో రౌడీలతో పోరాడుతున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Recommended Video

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుండాల పాలన నడుస్తుందని పేర్కొన్న పవన్ కళ్యాణ్ అలాంటి పరిస్థితులను తట్టుకుని నిలబడుతున్నాను అంటే అందుకు వరంగల్ పోరాట స్ఫూర్తి కారణమన్నారు. బిజెపి అభ్యర్థులకు మద్దతుగా హనుమకొండలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ తెలంగాణలో బిజెపికి అధికారం కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయానని, కనీసం బీసీ ముఖ్యమంత్రి అయిన చూసే అవకాశం కల్పించాలని ఆయన పేర్కొన్నారు.

బీసీ ముఖ్యమంత్రి అయినా చూడాలన్న ఉద్దేశంతోనే తాను బిజెపితో కలిసి వస్తున్నానని పేర్కొన్న పవన్ కళ్యాణ్ తమ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తన పోరాటానికి తెలంగాణ యువత కూడా అండగా ఉంటుందని పేర్కొన్న పవన్ కళ్యాణ్ ఇకపై తాను తెలంగాణలో కూడా తిరుగుతానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాను ఎలా తిరుగుతున్నానో తెలంగాణలో కూడా అదేవిధంగా తిరుగుతానని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ ఏ మార్పు కోసం తెలంగాణ బిడ్డలు చనిపోయారో.. అది సాధిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చిన స్ఫూర్తితోనే తను పదేళ్లుగా పార్టీని కొనసాగిస్తున్నానన్నారు. నాకు ఆంధ్ర జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మను ఇచ్చిందని పేర్కొన్న పవన్ కళ్యాణ్ నాడు తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇచ్చిన వారిలో నేను ఒకడినని స్పష్టం చేశారు. ఎంతోమంది అమరుల బలిదానాలపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అవినీతిమయం కావడం తనకు బాధను కలిగించిందని పేర్కొన్నారు.
వచ్చే ఏడాది నుంచి తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తానని పేర్కొన్నారు. పదేళ్లలో తాను తెలంగాణపై ఏ రోజూ మాట్లాడలేదని, కానీ ఇకపై తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడతాను అన్నారు. ప్రధాని పట్ల తనకి ఎంతో గౌరవం ఉందని తెలిపిన పవన్ కళ్యాణ్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్దం తర్వాత తను తెలంగాణ ప్రజలకు మాట ఇస్తున్నానని, వచ్చే సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రంలో కూడా పర్యటనలు చేస్తానని స్పష్టం చేశారు.
కమలం గుర్తుకు ఓటు వేసి రావు పద్మను, ఎర్రబెల్లి ప్రదీప్ రావును గెలిపించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోటీ చేస్తున్న బిజెపి జనసేన అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ సభ నేపధ్యంలో పవన్ ను చూసేందుకు జనాలు ఎగబడ్డారు.












Click it and Unblock the Notifications