సీఎం కెసిఆర్ పర్యటనలో ఉద్రిక్తం, కాన్వాయ్‌ను అడ్డుకున్నారు
ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఖమ్మం పర్యటనలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. కెసిఆర్ సోమవారం నాడు ఉదయం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం రమణగుట్ట, వికలాంగుల కాలనీల్లో కెసిఆర్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం బైపాస్ రోడ్డులో ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు పిడిఎస్‌యు విద్యార్థులు ప్రయత్నించారు. ఫీజు రీయింబర్సుమెంట్స్ వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో వారు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఖమ్మం నగరంలో పర్యటించిన సీఎంను సిపిఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. కెసిఆర్ నూతన బస్టాండ్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం రాపర్తినగర్లో డంపింగ్ యార్డు స్థలాన్ని పరిశీలించి తిరిగి వెళ్తుండగా సిపిఎం కార్యకర్తలు సీఎం కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరారు.

ఈ సందర్భంగా ఆయనకు వినతిపత్రాలు అందజేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ సోమవారం ఖమ్మం నగరానికి వచ్చారు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, కలెక్టర్, ఎస్పీ ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఖమ్మం నగర అభివృద్ధిపై సమీక్షలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. కెసిఆర్ వెంట తెరాస నేతలు కె కేశవ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
వరంగల్, ఖమ్మం మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌ల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 58 డివిజన్లు ఉన్నాయి.
ఎస్టీ (జనరల్) -1, ఎస్టీ (మహిళ) -1, ఎస్సీ (జనరల్) -5, ఎస్సీ (మహిళ) -4, బీసీ (జనరల్) -10, బీసీ (మహిళ) -15, అన్ రిజర్వ్‌డ్-13 ఉన్నాయి.
ఖమ్మం కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. వీటిలో ఎస్టీ (జనరల్)-1, ఎస్టీ (మహిళ)-1, ఎస్సీ (జనరల్)-3, ఎస్సీ (మహిళ)- 3, బీసీ (జనరల్)-9, బీసీ (మహిళ)-8, జనరల్ (మహిళ)-13, జనరల్ -12 డివిజన్లను కేటాయించారు.












Click it and Unblock the Notifications