పాలమూరు బంద్: 'చంద్రబాబు చీడపురుగు, కేసీఆర్ మాట నిలబెట్టుకుంటారు'
హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీడబ్ల్యూసీకి లేఖ రాయడంపై నిరసనగా టీఆర్ఎస్ నేతలు బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో జిల్లా వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యా, వాణిజ్య, వ్యాపార సంస్థలు స్వచ్చందంగా బంద్‌లో పాల్గొంటున్నాయి.
బంద్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బంద్‌లో పాల్గొన్న టీఆర్ఎస్ నేతలు ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ప్రాజెక్టును నిలిపివేయాలని సీడబ్ల్యూసీకి లేఖ రాసిన చంద్రబాబును తెలంగాణ టీడీపీ నేతలు నిలదీయాలని డిమాండ్ చేశారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన కూడళ్లలో పాలమూరు ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వనపర్తి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌లోని డిపోల ఎదుట టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు శ్రీనివాసరెడ్డి, జనార్ధన్‌రెడ్డిలు బైఠాయించి బంద్ పాటించారు. చంద్రబాబు తీరును నిరసిస్తూ భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు నేడు సాయంత్రం 4 గంటలకు జిల్లా కేంద్రంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు టీఆర్‌ఎస్ పేర్కొంది.

పాలమూరు బంద్‌పై టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ వైఖరిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే బంద్ పాటిస్తున్నామని చెప్పారు. ఈ బంద్ ద్వారా టీడీపీ నేతలకు కనువిప్పు కలిగాలని అన్నారు. ఎక్కడా సీమాంధ్ర నాయకులను బద్నాం చేయడం లేదని చెప్పిన ఆయన హైదరాబాద్‌లో ఉన్నవారికి తాగునీరు ఇవ్వాలంటే పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి కావాలని అన్నారు.
పాలమూరు ప్రాజెక్టుకు ఏపీ సీఎం చంద్రబాబు చీడపురుగులా అడ్డుపడుతున్నారని అన్నారు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. పాలమూరుపై సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్‌పై మాకు విశ్వాసం ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో సమర్ధవంతంగా పనిచేస్తున్నామన్నారు. ఈరోజు సాయంత్రం జరగనున్న అఖిలపశ్ర భేటీలో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. చంద్రబాబు జేజమ్మ వచ్చినా పాలమూరు ఎత్తిపోతల పథకం ఆగదని అన్నారు. ఎవరు అడ్డొచ్చినా పాలమూరు ప్రాజెక్టును కట్టితీరుతామని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications