హైదరాబాదులో చంద్రబాబు ఇంటికి నో పర్మిషన్: ఆస్తి పన్నుకు లింక్
హైదరాబాద్: హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఇళ్లు నిర్మాణానికి అనుమతిని హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) పెండింగులో పెట్టినట్లు తెలుస్తోంది. ఇంటి నిర్మాణ అనుమతిని నెలన్నరగా పెండింగ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. బుధవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.
చంద్రబాబు తన కొత్త ఇంటి నిర్మాణానికి అనుమతి కోరుతూ నెలన్నర క్రితం జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేశారు. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసిన నెల లోపు అనుమతి ఇవ్వాలి. కానీ నెలన్నర అయినా ఆ అనుమతిని ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచారు. సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగిస్తున్న భవనాలకు ఆస్తి పన్ను కడితేనే తన ఇంటి నిర్మాణానికి అనుమతి ఇస్తామని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారంటూ గురువారం వార్తాకథనాలు వచ్చాయి

మీడియా కథనాల ప్రకారం - ఇంటి నిర్మాణ అనుమతికి, సచివాలయ భవనాల ఆస్తి పన్నుకి సంబంధం ఏమిటని ప్రశ్నిస్తే, అది ప్రభుత్వ నిర్ణయమని, తామేం చేయలేమని సంబంధిత అధికారులు చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని చంద్రబాబు కుటుంబ సభ్యులు గవర్నర్ సలహాదారుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది.
సెక్షన్ 8 అమలు విషయంపై చర్చ సందర్భంగా చంద్రబాబు మంత్రి వర్గ సమావేశంలో తన ఇంటికి అనుమతి రాకపోవడంపై ప్రస్తావించినట్లు చెబుతున్నారు. సెక్షన్ 8 అమల్లోకి రాకపోవడం వల్ల హైదరాబాద్‌లో ఏపీ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, స్వయంగా నేను కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నానని, తన ఇంటి నిర్మాణానికి కూడా అనుమతి ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు చంద్రబాబు ఇంటికి అనుమతి ఇచ్చే విషయంలో జిహెచ్ఎంసి అనుసరిస్తున్న వైఖరి గురించి వివరించారు. సచివాలయంలో ఏపీ సర్కార్ వినియోగిస్తున్న భవనాలకు ఆస్తి పన్ను కట్టాలని కోరుతున్నారని, అది కట్టలేదంటూ సీఎం ఇంటి నిర్మాణ అనుమతిని పెండింగ్‌లో ఉంచారని ఆయన చెప్పారు. ఆ పన్ను కట్టవచ్చు కదా చంద్రబాబు ఆయనను ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications