రోహిత్ ఆత్మహత్య: దత్తాత్రేయ సహా 4గురిపై కేసు, బృందాన్ని పంపిన స్మృతి
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్య కేసులో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. బిజెపి నేత, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సహా నలుగురి పైన పోలీసులు కేసు నమోదు చేశారు.
రోహిత్ స్నేహితుల ఫిర్యాదుతో ఈ కేసు నమోదయింది. ఈ కేసులో ఏ1గా వర్సిటీ వీసీ అప్పారావు, ఏ2గా బండారు దత్తాత్రేయ, ఏ3గా ఏబీవీపీ నేత సుశీల్, ఏ4గా సుశీల్ సోదరుడు విష్ణుగా (బిజెవైఎం నాయకుడు) పేర్కొన్నారు. ఏఐస్‌ఏ నాయకుడు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాగా, కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై ప్రత్యేక విచారణ కోసం ఒక బృందాన్ని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పంపించారు. మృతి పైన ఓ కమిటీని వేసింది. రోహిత్ ఆత్మహత్య సంఘటన నేపథ్యంలో వర్సిటీలో విద్యార్థులు ఇవాళ ధర్నాకు దిగిన విషయం తెలిసిందే.

వర్సిటీలో ఉద్రిక్తత
రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ సందర్భంగా రోహిత్ తల్లి మాట్లాడుతూ... రోహిత్ సస్పెన్షన్ పైన తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. వీసీ దుర్మార్గంగా వ్యవహరించారన్నారు.
ఏబీవీపీ రెచ్చిపోతోంది: విద్యార్థులు
కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎబివిపి రెచ్చిపోతోందని హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కొందరు మండిపడ్డారు. వీసి అప్పారావు చీఫ్ వార్డెన్‌గా ఉన్ననాటి నుంచి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. వీసీని అరెస్టు చెయాలని వారు డిమాండ్ చేశారు.
యూనివర్సిటీలో ఇంటర్నల్ మెకానిజం ఉన్నప్పుడు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఎలా కల్పించుకున్నారని వారు ప్రశ్నించారు. గతంలో ఇదే యూనివర్సిటీలో ఆరుగురు విద్యార్థులు ఇలాగే తనువు చాలించారని, వారెవరికీ న్యాయం జరగలేదన్నారు.












Click it and Unblock the Notifications