phone tapping case: తీగలాగితే కదులుతున్న డొంక.. తెరపైకి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం!!
తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాపింగ్ కు గురయ్యాయని, అంతేకాదు ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నేతల డబ్బులు పట్టుకోవడంలో ఫోన్ ట్యాపింగ్ కీలకంగా పని చేసిందని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం
తెలంగాణలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో డిఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావును సస్పెండ్ చేయడంతో ఫోన్ ట్యాపింగ్ అంశం తెరమీదకు వచ్చింది. ఇక అప్పటినుంచి తెలంగాణ రాజకీయాల చుట్టూ తిరుగుతున్న ఈ అంశం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. అప్పటినుంచి ఈ కేసులో వరుసగా పోలీసు ఉన్నతాధికారుల పాత్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్న క్రమంలో తాజాగా మరో సంచలన విషయం బయటకు వచ్చింది.'

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. వారి ఫోన్లు ట్యాపింగ్
మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెర మీదకు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు ల ఫోన్లు ట్యాప్ చేసినట్టు గుర్తించారు.
రాధా కిషన్ రావు పాత్ర.. స్పెషల్ ఫ్లైట్ పై చర్చ
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో వారి సంభాషణలు విన్న తర్వాత గత ప్రభుత్వం అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సీసీ కెమెరాలను రాధా కిషన్ రావు అండ్ కో ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇక ఈ కేసు విచారణకు సంబంధించి అప్పుడు సిట్ అధికారులు స్పెషల్ ఫ్లైట్ లో ప్రయాణించడం, కేవలం నోటీసులు ఇవ్వడానికే స్పెషల్ ఫ్లైట్ ను ఉపయోగించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ నేత ఫ్లైట్ లో సిట్ అధికారులు .. కొనసాగుతున్న దర్యాప్తు
నాడు సిట్ అధికారులు ఉపయోగించిన స్పెషల్ ఫ్లైట్ కూడా ఒక బీఆర్ఎస్ నేతకు చెందినదని అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బి ఎల్ సంతోష్ కు, తుషార్ కు నోటీసులు ఇవ్వడానికి సిట్ అధికారులు ప్రత్యేక విమానంలోనే ఢిల్లీ, కేరళకు వెళ్లారని, కేవలం ఒక కేసు విచారణ నిమిత్తం ఎవరి అనుమతితో స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లారు అన్నది కూడా ఇప్పుడు విచారణకు వచ్చింది. మొత్తంగా ఎమ్మెల్యేలు కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కీలక భూమిక పోషించినట్లు ప్రస్తుతం తెలుస్తుంది.












Click it and Unblock the Notifications