జల్సాలు, బెట్టింగులకు మరిగి..: ఘరానా చైన్ స్నాచర్ ఇతనే (ఫొటో)
వనస్థలిపురం: జల్సాలకు, బెట్టింగులకు అలవాటు పడి, వాటి కోసం చేసిన అప్పులు తీర్చేందుకు చైన్ స్నాచర్‌గా మారిన వ్యక్తిని హైదరాబాదులోని వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బీనగర్ డీసీపీ తప్సీర్ ఇక్బాల్ బుధవారం వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
గుంటూరు జిల్లా వెల్గొండకు చెందిన చెల్లగాని మురళీకృష్ణ(24) తన కుటుంబంతో కలిసి వనస్థలిపురం వైదేహినగర్‌లో నివాసం ఉంటున్నాడు. స్నేహితులతో కలిసి జల్సాలు చేయడంతో పాటు, క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. దీంతో అప్పులు పెరగడంతో వాటిని తీర్చేందుకు చోరీల మార్గాన్ని ఎంచుకున్నాడు.

గత సంవత్సరం నవంబర్ నుంచి వనస్థలిపురం ప్రాంతంలో 10చోట్ల స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. మరో రెండు చోట్ల విఫలయత్నం చేశాడు. మంగళవారం సాయంత్రం ఎన్జీవోస్ కాలనీలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు.
దీంతో తన స్నాచింగ్‌ల వరస క్రమాన్ని వివరించాడు. నిందితుడి వద్ద నుంచి రూ.7లక్షల విలువైన 25తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో ఏసీపీ భాస్కర్‌గౌడ్, సీఐ పుష్పన్‌కుమార్, ఎస్‌ఐ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications