ఉప్పల్ పైప్ లైన్ ప్రారంభోత్సవం : కాసేపటికే లీకేజీ.. 'నాసిరకం' పనులంటూ ఆరోపణ
హైదరాబాద్ : తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఇలా మంచినీటి పైపు లైను పనులను ప్రారంభి వెళ్లారో లేదో.. ఆ పైపు లైను కాస్త పగిలిపోయి నీరంతా వృథాగా పోయింది. పనుల్లో నాణ్యతా లోపాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. హైదరాబాదు శివారు ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ పరిధిలోని ఉప్పల్ హిల్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
సుమారు రూ.3కోట్ల వ్యయంతో ప్రభుత్వం చేపట్టిన మంచినీటి పైపు లైన్ పనులను తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కలిసి ప్రారంభించారు. పైపు లైన్ ను ప్రారంభించి ప్రజా ప్రతినిధులు అక్కడినుంచి వెళ్లిపోయిన కొద్దిసేపటికే.. పైపు లైన్ లీకేజీ అయ్యింది.

పనుల్లో నాణ్యత పాటించకుండా నాసిరకంగా పైపు లైన్ పనులు చేపట్టడం వల్లే పరిస్థితి ఇలా తయారైందని అక్కడి స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా, పనులు ప్రారంభించి వెళ్తున్న మంత్రి కాన్వాయ్ ను.. నాలాలను కబ్జా చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అక్కడినుంచి పంపించేశారు.












Click it and Unblock the Notifications