మోడీ వద్ద ఏదో ప్రత్యేక వ్యూహం ఉంది: నోట్ల రద్దుపై కేసీఆర్
నోట్ల రద్దు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ వద్ద ఏదో ప్రత్యేక వ్యూహం ఉండే ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం నాడు అసెంబ్లీలో చెప్పారు.
హైదరాబాద్: నోట్ల రద్దు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ వద్ద ఏదో ప్రత్యేక వ్యూహం ఉండే ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం నాడు అసెంబ్లీలో చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిది కాదన్నారు.
తాను గతంలో ప్రధాని ప్రసంగంలోని మాటలే చెప్పానని అన్నారు. నోట్ల రద్దు మంచిదని, దేశానికి మంచి జరిగితే సమర్థించాలన్నారు. అక్రమాలు ఆపాలనే నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పారు. నోట్ల రద్దును బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా సమర్థించారని చెప్పారు.
బంగారం పైన కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. బంగారం పైన అనవసర ప్రచారం జరిగిందని అభిప్రాయపడ్డారు. ప్రజల నగదు సమస్యను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు. కేవలం నల్ల ధనాన్నే కాదని, ఇంకా వివిధ రూపాల్లో నల్లధనం ఉందని చెప్పారు.
నల్లధనం ఏ రూపంలో ఉన్నా..
బంగారు కడ్డీలు, వజ్రం, ఇతర రూపాలలో ఉన్న నల్లధనాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలన్నారు. ఇప్పటి దాకా అలవాటు లేదు కాబట్టి ఎవరూ డిజిటల్ విధానాన్ని ఉపయోగించలేదన్నారు. నేను కూడా చెక్ రాసి ఇచ్చేవాడినని చెప్పారు.

కానీ అవసరం వచ్చినప్పుడు, దేశానికి మంచి జరిగినప్పుడు మనం కూడా క్యాష్ లెస్ లావాదేవీలు ఉపయోగించాలన్నారు. నగదు రహిత లావాదేవీలకు అందరు అలవాటు పడాలన్నారు. అందులో ఎలాంటి తప్పు లేదన్నారు.
బ్యాంకు ఉద్యోగులు కూడా నగదు రహిత లావాదేవీలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దుతో ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట నిజమేనని చెప్పారు. నగదు రహిత లావాదేవీలతో ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందన్నారు.
స్వైప్ మిషన్లు మనం కొనలేమని విపక్ష నేతలు చెబుతున్నారని, కానీ వాటిని బ్యాంకర్లే సరఫరా చేస్తారన్నారు. స్వైపింగ్ మిషన్ వాడకం ద్వారా, మొబైల్ వాడకం ద్వారా.. ఇలా నగదు రహితం కావొచ్చన్నారు. కేవలం స్వైప్ మిషన్లే కాదన్నారు.
100 శాతం సాధ్యం కాదు కానీ..
100 శాతం నగదు రహిత లావాదేవీలు ఎక్కడా సాధ్యం కాదన్నారు. అమెరికా, బ్రెజిల్ వంటి దేశంలోనే పూర్తిగా లేదన్నారు. కానీ మంచి జరుగుతున్నప్పుడు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సహకరించాలని కేసీఆర్ అన్నారు. ప్రధాని మోడీ ప్రజలను కష్టపెట్టాలని నోట్ల రద్దు నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రజల సమస్యలు తీర్చేందుకు కేంద్రం చిన్న నోట్లను త్వరగా తెలంగాణకు పంపించాలన్నారు.












Click it and Unblock the Notifications