హైదరాబాద్ కు ప్రధాని మోదీ - టీడీపీతో పొత్తు పై నిర్ణయం..!?
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రధాని టూర్ ఖరారైంది. ఫిబ్రవరి 13న ప్రధాని హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఈ నెల 19న ప్రధాని హైదరాబాద్ పర్యటనకు రావాల్సి ఉంది. దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే, కర్ణాటక - మహారాష్ట్ర పర్యటనలతో హైదరాబాద్ టూర్ వాయిదా పడింది. దీంతో..సంక్రాంతి నాడు సికింద్రాబాద్ - విశాఖ మధ్య వందేభారత్ ను ప్రధాని వర్చ్యువల్ గా ప్రారంభించారు. ఇప్పుడు ప్రధాని హైదరాబాద్ పర్యటనలో బహిరంగ సభలో పాల్గొనున్నారు. రాజకీయంగా కీలక నిర్ణయం వెలువరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

13న హైదరాబాద్ కు ప్రధాని
ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారికంగా ఫిక్స్ అయింది. ప్రధాని తన పర్యటనలో భాగంగా గతంలో నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 19వ తేదీన నిర్ణయించిన షెడ్యూల్ లోనూ ఈ కార్యక్రమాలు ఉన్నాయి. ఆ టూర్ వాయిదా పడటంతో ఇప్పటి పర్యటనలో వీటిని ప్రారంభించనున్నారు. అదే విధంగా తెలంగాణలో దాదాపు మూడు వేల కోట్ల రూపాయల విలువైన పనులను ప్రధాని శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. ఆ తరువాత పార్టీ నేతలకు ప్రధాని సమయం కేటాయించారు. పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే పార్టీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు.

బహిరంగ సభ ద్వారా ఎన్నికల శంఖారావం
మరో తొమ్మది నెలల కాలంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని బీజేపీ ముఖ్య నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో..ఇప్పుడు తెలంగాణ పైన స్వయంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రారంభించి.. జాతీయ నేతలను ఏకం చేసే పని ప్రారంభించారు. తాజాగా ఖమ్మం సభలోనూ ప్రధాని లక్ష్యంగా విమర్శలు ఎక్కు పెట్టారు. కేసీఆర్ బీఆర్ఎస్ నిర్ణయం తరువాత రెండు సార్లు ప్రధాని తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో.. రాజకీయంగా ఇక నేరుగా టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికలకు సన్నద్దపై స్వయంగా పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.













Click it and Unblock the Notifications