ఇదేం పిచ్చి పని.. కుటుంబం పట్టించుకోవడం లేదని ఓ యువకుడు ఏం చేశాడంటే ?
ఆదిలాబాద్ జిల్లాలో సంచలనంగా మారిన స్కూల్లో విషప్రయోగం ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ధర్మపురి గ్రామానికి చెందిన సోయం కిస్టుగా గుర్తించారు. అయితే కుటుంబం పట్టించుకోవడం లేదని.. అందుకే ఏదైనా సంచలనంగా చేయాలని ఇలా చేశానంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ పాఠశాలకు గత శనివారం, ఆదివారం సెలవుల నేపథ్యంలో.. సిబ్బంది వంట గదికి తాళం వేసి ఇంటికెళ్లారు. సోమవారం ఉదయం వంట చేసే ముందు పాత్రలు కడుగుతుండగా వాటిలోంచి చెడు వాసనతో పాటు నురుగలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది చుట్టూ గమనించగా, అక్కడ పురుగుల మందు డబ్బా కనబడింది.

తాగు నీటి ట్యాంక్‌ను పరిశీలించగా, అందులోనూ అదే విషాన్ని కలిపినట్లు గుర్తించారు. సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు సంబంధిత ఘటనపై విచారణ చేపట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పాఠశాల సిబ్బంది కంప్లైంట్ మేరకు.. రంగంలోకి దిగిన పోలీసులు ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షణలో పాఠశాల ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, ఖాళీ పురుగుల మందు డబ్బా లభ్యమైంది. ఈ క్రమంలోనే ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. వారిలో ఒకడైన సోయం కిస్టు నేరం అంగీకరించాడని తెలిపారు. అతను పాఠశాల సమీపంలోనే నివసిస్తున్నట్టు వెల్లడించారు. అతన్ని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని ఎస్పీ తెలిపారు.
తన కుటుంబ సభ్యులు తనను పట్టించుకోకపోవడంతో.. వారి దృష్టిని ఆకర్షించడానికే ఈ పని చేసినట్లు కిస్టు చెబుతున్నాడు. తన సోదరుడు పత్తి చేను కోసం తెచ్చిన పురుగుల మందునే ఆ పని చేయడానికి ఉపయోగించానన్నాడు. పాత్రలపై మందు చల్లి, బకెట్‌లోని నీటిలో కలిపానని.. ఓవర్ హెడ్ ట్యాంకులో మాత్రం కలపలేదని అంటున్నాడు. ఏ పనిలోనూ తనకు సహకరించడం లేదని కొంతకాలంగా అసంతృప్తితో ఉండి ఈ చర్యకు పాల్పడినట్టు పోలీసులు వివరించారు. నిందితుడు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.
క్షణికావేశంలో.. పిచ్చి ఆలోచనలతో ఈ తరహా పనులు చేయడం ఏంటని.. సదరు యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆ వంట పాత్రల్లో వండి.. చిన్నారులకు ఏదైనా జరిగి ఉంటే ఆ నష్టాన్ని ఎవరు తీర్చేవారని ప్రశ్నిస్తున్నారు. మరోసారి ఎవరు ఈ తరహా ఘటనలకు పాల్పడవద్దని హితబోద చేస్తున్నారు.












Click it and Unblock the Notifications