బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదు: ట్విస్ట్ ఇచ్చిన బాధితుడు!
హైదరాబాద్: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమారుడు భగీరథపై దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మహీంద్రా వర్సిటీకి చెందిన విద్యార్థిపై బండి భగీరథ దాడి చేసినట్లు విశ్వవిద్యాలయ క్రమశిక్షణా సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
కాలేజీ ప్రాంగణంలోనే ఈ దాడి జరిగిందన్నారు. కొన్ని రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుందని ఫిర్యాదు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా దుండిగల్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Bandi Sanjay’s son is very Violent !
— krishanKTRS (@krishanKTRS) January 17, 2023
This is Unlawful pic.twitter.com/Nv9Bcn3X6H
కాగా, మహీంద్రా వర్సిటీలో మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతున్నాడు భగీరథ. ఇటీవల శ్రీరామ్ అనే విద్యార్థిని దూషించడంతోపాటు దాడి చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఐపీసీ 341, 322, 504, 506, 34 సెక్షన్ల కింద బండి సంజయ్ తనయుడు భగీరథ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ డీసీపీ సందీప్ రావ్ వెల్లడించారు. మహీంద్రా యూనివర్సిటీ ఇచ్చిన ఆధారాల ప్రకారం కేసు విచారణ జరుపుతామని తెలిపారు. కాగా, ఈ ఘటన తెలంగాణలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం బండి భగీరథ దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, పాత వీడియోను ఇప్పుడు బయటపెట్టారంటూ బాధిత విద్యార్థి శ్రీరామ్ చెబుతున్నాడు. తాను ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టినందుకే తనపై భగీరథ దాడి చేశాడని చెప్పాడు. అయితే, తాను, భగీరథ ఇప్పుడు చాలా మంచి ఫ్రెండ్స్ అని.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవు అంటూ చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications