బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. గత ఏడాది నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలో పార్టీ కండువాతో చొరబడి ఓటర్లను మభ్యపెట్టారంటూ కాంగ్రెస్ నాయకుడు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అదే రోజు అప్పటి రిటర్నింగ్ ఆఫీసర్ తోపాటు పోలీసులకు కాంగ్రెస్ స్టేట్ యూత్ లీడర్, కాంగ్రెస్ అభ్యర్థి పోలింగ్ ఏజెంట్ అయిన ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కండువాతో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లవద్దని పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెప్పినా వినలేదని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

బలవంతంగా పోలింగ్ బూత్‌లోకి చొచ్చుకు వెళ్లి ఎన్నికల కోడ్ ఉల్లంఘించాడని సదరు ఫొటో ఆధారాలను జత చేస్తూ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. 188 ఐపీసీ, 130 ఆర్పీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం ఆదివారం బయటకు వచ్చింది. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా.. పల్లాపై కేసు నమోదైంది వాస్తవమేనని స్పష్టం చేశారు.
ఇది ప్రజా పాలన కాదు.. ప్రతీకార పాలన: బాల్క సుమన్
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు.. ప్రతీకార పాలన కొనసాగుతుందని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో దుండగుల దాడిలో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పట్టణ ప్రధాన కార్యదర్శి గడప రాకేష్‌ను బాల్క సుమన్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. రాకేష్‌పై కాంగ్రెస్ గూండాలే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
పగలతో, కక్షలతో కూడిన పరిపాలనను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని బాల్క సుమన్ ధ్వజమెత్తారు. రాకేష్‌పై హత్యాయత్నానికి ప్రయత్నించిన గుండాలను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశాంతమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హత్య రాజకీయాలపై కాకుండా జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. తమ కార్యకర్తలను కడుపున పెట్టుకొని కాపాడుకుంటామని, వారి జోలికి వస్తే ఎంతటి పోరాటానికైనా సిద్ధం అని బాల్క సుమన్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications