పోలీసు అమరవీరుల సంస్మరణదినం: నివాళులర్పించి మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి ఏం చెప్పారంటే!!
రాష్ట్ర వ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు కొనసాగుతున్నాయి. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విధినిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసులకు రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ మోహమూద్ అలీ, తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 264 మంది పోలీసు జవాన్లు విధినిర్వహణలో ప్రాణాలు అర్పించారని పేర్కొని వారందరికీ నివాళులర్పించారు. పోలీస్ అమరుల వారోత్సవాల పుస్తకాన్ని హోమంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

శాంతి భద్రతలు బాగుంటేనే సామాజిక అభివృద్ధి
హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోలీసు ఫ్లాగ్ డే పెరేడ్ లో అమరులైన పోలీసులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ శాంతి భద్రతలు బాగుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. సంఘవిద్రోహ శక్తుల కార్యకలాపాలు అరికట్టడంలో రాష్ట్ర పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. తీవ్రవాద, ఉగ్రవాద, మతతత్వ శక్తులును ఎట్టి పరిస్థితుల్లో పెరగనివ్వకుండా రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని మహమ్మద్ అలీ వెల్లడించారు.
పోలీసులు అమరుల స్పూర్తితో విధినిర్వహణలో పునరంకితమవ్వాలి
గత ఎనిమిదేళ్ళుగా రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని పేర్కొన్న ఆయన, శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటేనే ఏదేశమైనా రాష్ట్రమైనా, అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. శాంతి భద్రతల నిర్వహణలో అహరహం శ్రమిస్తున్న పోలీసులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి మహమూద్ అలీ తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం స్ఫూర్తితో పోలీసులు విధి నిర్వహణకు పునరంకితం కావాలని మంత్రి మహమూద్ అలీ పిలుపునిచ్చారు. పోలీసులు నిరంతరం అరాచక శక్తులను అణచివేసి, శాంతిభద్రతలను ఇనుమడింపచేయటానికి కొత్త ఉత్సాహంతో పనిచేయాలనిమంత్రి విజ్ఞప్తి చేశారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడటంలో దేశంలోనే తెలంగాణా పోలీసులు ముందంజలో: డీజీపీ
రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు చేస్తున్న త్యాగాలను కొనియాడారు. రాష్ట్ర పోలీసులు శాంతి, భద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించటంలో దేశంలోనే ముందంజలో ఉన్నారని తెలిపారు. ఒకే రాష్ట్రం, ఒకే సేవ అనే ప్రాతిపదికగా జవాబుదారీతనం, పారదర్శకత కలిగిన స్నేహపూర్వక పోలీసు సేవలను అందిస్తున్నామని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల సి సి టీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే ప్రక్రియ కొనసాగుతోందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

శాంతిభద్రతల నిర్వహణకు 600 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్
సైబర్ నేరాలను అదుపు చేసేందుకు తెలంగాణ సైబర్ నేరాల సమన్వయ కేంద్రం ఏర్పాటుతో పాటు, ఫ్యూచర్ టెక్నాలజీని అమలు చేస్తున్నట్లు డిజిపి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.పటిష్టమైన శాంతి, భద్రతల నిర్వహణకు 600 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఇటీవలే ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పలు పోటీలను నిర్వహిస్తున్నామని, పలు కార్యక్రమాలను చేస్తున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications